ఎన్నికలకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి

– వివరాలను తక్షణమే అందించాలి
– పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా  ఎన్నికల యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన కోరారు.
మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆమె వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలతో సంబంధం ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకుగాను ఆయా జిల్లాల నుండి అవసరమైన సిబ్బంది వివరాలను, అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్ ల వివరాలను తక్షణమే సమర్పించాలని కోరారు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల రూట్ మ్యాప్, ఇంటర్మీడియటరి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వివరాలను సైతం సమర్పించాలని కోరారు. జిల్లాస్థాయి అధికారులను, ప్రత్యేకించి పార్లమెంటు ఎన్నికలలో నోడల్ అధికారులుగా వ్యవహరించిన వారినే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం నోడల్ అధికారులుగా నియమించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల రూట్లు, రూట్ మ్యాప్ లు తయారు చేయాలని, అవసరమైన పోలింగ్ సామాగ్రి, వాహనాలు వంటి వాటి విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని, బడ్జెట్ వివరాలను సైతం ముందే పంపించాలని కోరారు. నిర్దేశించిన సమయంలోగా అభ్యంతరాలు అన్నింటిని పరిష్కరించాలని చెప్పారు. పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆమె తెలియజేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అందరూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల నుండి జిల్లా కలెక్టర్లు, నల్గొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.