
– మహిళ, షీ టీం పోలీస్ స్టేషన్లు.. భరోసా కేంద్రం సందర్శన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టర్
మహిళలకు అండగా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చంద్ర పవర్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మహిళా, షి టీం పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్ లను పరిశీలించి, షి టీమ్ బృందాల పనితీరు,పోలీస్ స్టేషన్ పరిసరాలు,లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రంలో కల్పించే న్యాయ సలహాలు,సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న భద్రతా చర్యలు,మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అక్కడి సిబ్బంది నేను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని, ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోనీ షి టీమ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోటా డేగ కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూన్నాయని అన్నారు. నల్లగొండ షీ టీమ్స్ బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా, పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ పద్దతిలో, వాట్స్ అప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట ఉమెన్ సీఐ కరుణాకర్, యస్.ఐలు సిబ్బంది ఉన్నారు.
కేసుల వివరాలు.. చేపట్టిన కార్యక్రమాలు
జూన్ లో వచ్చిన ఫిర్యాదులు 11, పెట్టి కేసులు 8, రెడ్ హ్యాండెడ్ గా 11 మంది పట్టుకున్నారు. మహిళలు టీజింగ్ కు గురయ్యే 145 ప్రాంతాలను సందర్శించారు.నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు 31, పదిమందికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఫిర్యాదులకు సంప్రదించాల్సిన నెంబర్లు..
మహిళా సమస్యలపై పిర్యాదు చేయడానికి నల్లగొండ జిల్లా షీ నెంబర్ 8712670235, జిల్లా ఎస్పీ 8712670200, షీ టీమ్ ఇన్చార్జ్ సీఐ కరుణాకర్ 8712670143,మిర్యాలగూడ ఇంచార్జీ యస్.ఐ కోటేష 8096004465, నెంబర్లకు నేరుగా పిర్యాదు చేయవచ్చు.