– మైనార్టీ శాఖ వైస్ ఛైర్మన్ గా యం.ఏ జబ్బార్
– ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన రమేష్ రెడ్డి
– సంబురాలు జరుపుకుంటున్న అభిమానులు
– టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దశాబ్ద కాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక, పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ దృష్టి సారించి.. 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అధిష్ఠానం అనుమతితో వారి నియామకాలకు అంతా సిద్ధం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చి.. ఆ నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ఆగిపోయిన విషయం తెల్సిందే.కాగా సోమవారం అధికారికంగా 35 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకు రెండు పదవులు వరించాయి.అందులో సూర్యాపేటకు చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కి పర్యాటక డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అదేవిధంగా కోదాడ కు చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు, వక్ఫ్ బోర్డు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ చైర్మన్ యం.ఏ జబ్బార్ కు మైనార్టీ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ పదవి వరించింది. దీంతో సూర్యాపేట,కోదాడ లలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలావుండగా గత రెండు పర్యాయలు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టిక్కెట్ ఆశించి బంగపడిన రమేష్ రెడ్డి కి ఏఐసీసీ, టీపీసీసీ లు యంపీ టిక్కెట్ ఇస్తామని రెండు దఫాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పలు విభాగాలకు కార్పొరేషన్ లకు చైర్మన్ లను ప్రకటించారు. అందులో పటేల్ రమేష్ రెడ్డి కి పర్యాటక డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రకటన విడుదల తో రమేష్ రెడ్డి తో పాటు ఆయన వర్గ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రమేష్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని టిడిపి తో ప్రాంభించారు. సర్పంచ్, జెడ్పిటిసి తదితర పదవులు ఆయన నిర్వహించారు. అనంతరం టిడిపి నుండి సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి దాదాపుగా 38 వేల ఓట్లు సాధించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆనాడు రేవంత్ రెడ్డి తో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడిన విషయం తెల్సిందే.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తో పాటు తన స్నేహితుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రమేష్ రెడ్డి కి కలిసి వచ్చింది. ఏఐసీసీ, టీపీసీసీ లు ఇచ్చిన హామీలతో ఆయనకు తొలి విడతలోనే పర్యాటక డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో గల టూరిజం కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆయన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా టూరిజం కార్యాలయం అధికారులు రమేష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక సూర్యాపేటలో రమేష్ రెడ్డి నివాసం వద్ద నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
కాగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తకే కాకుండా పేటకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. తన పై పెట్టిన నమ్మకాన్ని బాధ్యతలు నిలబెట్టుకుంటా అన్నారు.రాష్ట్రం తో పాటు జిల్లాను పర్యాటక రంగంగా తీర్చిదిద్దెందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని శక్తి వంచన లేకుండా తన వంతు సహకారం అందిస్తానని ఇది సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న పిల్లలమర్రి దేవాలయం ,ఉండ్రుగొండ నాగులపాడు ,సద్దుల చెరువు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఫార్సు తో మైనార్టీ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ గా యం.ఏ జబ్బార్ కు పదవి దక్కింది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గా ఉన్న సమయంలో జబ్బార్ ఉమ్మడి నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు.ముస్లిం మైనారిటీలలో మంచి పేరు తెచ్చుకున్న జబ్బార్ కు పదవి రావడం పట్ల కోదాడ నియోజకవర్గo లో మైనార్టీలు సంబరాలు జరుపుకుంటున్నారు.