నేటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు

– టీపీసీసీ అధ్యక్షులు
– మహేష్‌కుమార్‌గౌడ్‌ కార్యాచరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేష్‌కుమార్‌గౌడ్‌ తన కార్యాచరణ ను సిద్ధం చేశారు. శనివారం నుంచి ఆయా జిల్లాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వం పథకాలపై విస్తృత ప్రచారం చేయడం, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీని సిద్ధం చేయడంలో భాగంగా సమీక్షలు చేపట్టారు. నాయకుల పని తీరు ప్రాతిపదికన పార్టీ పదవులు ఇచ్చేందుకు సమావేశా లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పదవులు పొందని నేతలకు పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు ఆయన ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన నాయకులతో శనివారం సమీక్షలు ప్రారంభించనున్నారు.ఈ సమీక్షలో ఏఐసీసీ ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాథ్‌ జిల్లాల సమీక్షల్లో పాల్గొంటారు. ఈ సమీక్షలో డీసీసీ అధ్యక్షులు, సీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు,అనుబంధ సంఘాల చైర్మెన్లు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారు. షెడ్యూల్‌ ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరంగల్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్‌ జిల్లా, 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్‌ జిల్లాల సమీక్షా సమావేశాలు జరుగుతాయి.