– సొంతగడ్డపై రెండో ఓటమి
– ఆర్సీబీపై సూపర్‌జెయింట్స్ గెలుపు
– లక్నో 181/5, బెంగళూర్ 153/10
నవతెలంగాణ-బెంగళూర్
చిన్నస్వామిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌కు చుక్కెదురు. ఐపీఎల్ 17లో అన్ని జట్లు సొంతగడ్డపై విజయాలు సాధిస్తుండగా ఆర్సీబీ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. 182 పరుగుల ఛేదనలో ఆర్సీబీ చేతులెత్తేసింది. మహిపాల్ లామ్రోర్ (33, 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రజత్ పాటిదార్ (29, 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (22, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మరో బ్యాటర్ 20 ప్లస్ పరుగులు చేయలేదు. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆర్సీబీ కుప్పకూలింది. అంతకుముందు, క్వింటన్ డికాక్ (81, 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (40 నాటౌట్, 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) రాణించటంతో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది.
డికాక్ దంచికొట్టాడు
సొంతగడ్డపై టాస్ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్న బౌండరీల చిన్నస్వామి మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. క్వింటన్ డికాక్ (81), కెఎల్ రాహుల్ (20) తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 53 పరుగులు అందించారు. ఓపెనర్ల మెరుపులతో లక్నో సూపర్‌జెయింట్స్ భారీ స్కోరు దిశగా సాగింది. రెండు సిక్సర్లతో మెప్పించిన కెప్టెన్ రాహుల్.. ఆ జోరు కొనసాగించటంలో విఫలమయ్యాడు. మాక్స్‌వెల్ మాయజాలం ముంగిట వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్‌లో క్వింటన్ డికాక్ ఫామ్ కొనసాగించాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 36 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకున్నాడు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (6) మరో అవకాశం వృథా చేసుకున్నాడు. 11 బంతుల్లో ఆరు పరుగులే చేసి డగౌట్‌కు చేరుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ (24)తో కలిసి డికాక్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. స్టోయినిస్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో జోరందుకున్నట్టే కనిపించాడు. కానీ మార్కస్ జోరుకు సైతం మాక్స్‌వెల్ కళ్లెం వేశాడు. డికాక్‌తో జతకలిసిన నికోలస్ పూరన్ (40 నాటౌట్) ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. డెత్ ఓవర్లలో దంచికొట్టిన పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌తో దండయాత్ర చేశాడు. ఆయుశ్ బదాని (0) విఫలం కాగా..కృనాల్ పాండ్య (0 నాటౌట్)కు స్ట్రయిక్ అవకాశం రాలేదు. నికోలస్ పూరన్ మెరుపులతో లక్నో సూపర్‌జెయింట్స్ 181 పరుగులు చేసింది.