అమ్మాయిలకు భంగపాటు

– వన్డేల్లో తొలిసారి భారత్‌పై బంగ్లా గెలుపు
– 154 పరుగుల ఛేదనలో భారత్‌ చతికిల
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) అనుభవం అక్కరకు రాలేదు. స్లో వికెట్‌పై పరుగులు రాబట్టేందుకు టీ20 అనుభవం ఉపయోగపడలేదు. బంగ్లాదేశ్‌ స్పిన్నర్ల మాయలో భారత మహిళల జట్టు విలవిల్లాడింది. తొలిసారి వన్డే మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో భారత మహిళలు 40 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూశారు.
మీర్పూర్‌ (బంగ్లాదేశ్‌) భారత్‌కు భంగపాటు. 154 పరుగుల ఛేదనలో 113 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ ఇండియా అమ్మాయిలు 40 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూశారు. మీర్పూర్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో భారత్‌ పరాజయం పాలైంది. స్పిన్నర్ల మాయజాలంతో స్వల్ప స్కోరును కాపాడుకున్న బంగ్లాదేశ్‌.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసింది. ఛేదనలో దీప్తి శర్మ (20, 40 బంతుల్లో), అమన్జోత్‌ కౌర్‌ (15, 40 బంతుల్లో 1 ఫోర్‌), యస్టికా భాటియా (15, 24 బంతుల్లో 1 ఫోర్‌) మినహా ఎవరూ కనీస పోరాట స్ఫూర్తి చూపించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన (11), స్నేV్‌ా రానా (0) విఫలమయ్యారు. 35.5 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ మహిళలు 43 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (39, 64 బంతుల్లో 3 ఫోర్లు), ఫర్జానా హాక్‌ (27, 45 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో భారత్‌ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 154 పరుగులుగా నిర్థారించారు. బంగ్లాదేశ్‌ బౌలర్‌ మారూఫ అక్తర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో వన్డే బుధవారం మీర్పూర్‌లోనే జరుగనుంది.
ఛేదనలో చతికిల : డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో సవరించిన లక్ష్య ఛేదనలో టీమ్‌ ఇండియా తడబాటుకు గురైంది. స్లో వికెట్‌పై పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు విఫలమయ్యారు. టీ20 సిరీస్‌లో భారత్‌కు సవాల్‌ విసిరిన బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు వన్డేల్లో మాయ చేశారు. కొత్త బంతితో బంగ్లాదేశ్‌ పేసర్‌ మరూఫ అక్తర్‌ విజృంభించింది. నాలుగు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించింది. స్పిన్నర్‌ రబేనా ఖాన్‌ (3/30) మిడిల్‌ ఓవర్లలో కీలక వికెట్లతో కోలుకోలేని దెబ్బకొట్టింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా రొడ్రిగస్‌, స్మృతీ మంధాన, ప్రియ పూనియా తేలిపోయారు. అంతకుముందు, ఆమన్జోత్‌ కౌర్‌ (4/31), దేవిక వైద్య (2/36) రాణించటంతో బంగ్లాదేశ్‌ 152 పరుగులకే కుప్పకూలింది.