– గత ఐదేండ్లలో ఉద్యోగ కల్పనలో కానరాని వృద్ధి
– ఉద్యోగాన్ని హక్కుగా గుర్తిస్తేనే సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. స్వాతంత్య్రానంతరం పరిస్థితి ఇంతలా దిగజారడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. వారిలో అనేక మందికి నేటికీ సరైన ఉపాధి లభించలేదు. 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019-20లో నమోదైన దాని కంటే 18% అధికంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నప్పటికీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధి కల్పనలో ఏ మాత్రం వృద్ధి లేదని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ అనే సంస్థ తెలిపింది. కోవిడ్ తర్వాత పెద్ద తరహా సంస్థలతో పోలిస్తే చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉపాధి కల్పన చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం.
దేశంలో 2019 నాటికే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 1973లో మొదటిసారి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ మాంద్యం నెలకొంది. అప్పటి నుండి నమోదైన నిరుద్యోగ రేటు కంటే 2019లోనే అధిక రేటు నమోదైంది. నిరుద్యోగ పరిస్థితి దారుణంగా ఉండటానికి మరో కారణం నయా సరళీకరణ విధానాల కారణంగా అనివార్యంగా ఏర్పడిన పరిస్థితులు. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం ప్రారంభిం చినప్పటి నుండి నయా సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చే వరకూ ఉద్యోగాల కల్పనలో వృద్ధి సగానికి సగం తగ్గిపోయింది. అయితే ఈ రెండు కాలాల మధ్య సగటు జీడీపీ వృద్ధి రేటు రెట్టింపు అయిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఉద్యోగాల కల్పన పడిపోవడం గమనార్హం.
నయా సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత నమోదైన కార్మికుల సగటు వృద్ధి రేటు కంటే ఉద్యోగాల కల్పనలో వృద్ధి తగ్గిపోయింది. వ్యవసాయానికి ప్రభుత్వం మద్దతు ఉపసంహరిం చుకోవడంతో ఆ రంగం కుదేలైపోయింది. దీంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన అనేక మంది కార్మికులు నగరాలు, పట్టణాలకు వలస పోవాల్సి వచ్చింది. అక్కడ వారంతా ఉద్యోగార్థులుగా మిగిలిపోయారు.
నిరుద్యోగాన్ని పెంచిన సాంకేతికత
నయా సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారులు ప్రవేశించారు. వారంతా తమ అవసరాల కోసం ఉపాధి అవకాశాలు సృష్టించారు. సాంకేతికతలో సాధించిన అభివృద్ధి కార్మికుల ఉత్పాదకతను పెంచినప్పటికీ ఆ సాంకేతికత కారణంగానే చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వంద మంది చేసే పనిని యాభై మందితోనే పూర్తి చేయవచ్చు. నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో వేతనాల్లో పెరుగుదల లేకుండా పోయింది. వేతన బిల్లులు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు లాభాలు మూటకట్టుకున్నారు. వేతనాల్లో అసమానతలు, కార్మికుల వేతన బిల్లుల్లో తగ్గుదల పెట్టుబడిదారులకు లాభాలుగా మారడం వంటి పరిణామాలతో వినియోగం పడిపోయింది. ఎందుకంటే వేతనాలు బాగా ఉన్నప్పుడే వినియోగంపై వ్యయం పెరుగుతుంది. సాంకేతికత కారణంగా ఉత్పత్తి పెరిగినా అది అంతిమంగా నిరుద్యోగాన్ని పెంచింది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో…
పెట్టుబడిదారుల లాభాలు పెరిగితే ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుందని, ఒకవేళ అది తగ్గినా తాత్కాలికమే అవుతుందని కొందరు ఆర్థికవేత్తలు తప్పుడు అంచనాలు వేశారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. సాంకేతికత, యాంత్రీకరణ కారణంగా ప్రారంభమయ్యే నిరుద్యోగ సమస్య అనియంత్రిత పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. తక్కువ మందితో పని చేయించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించేందుకే పెట్టుబడిదారులు ప్రయత్నిస్తారు తప్ప సాంకేతికతను ఆసరాగా చేసుకొని మరింత మందికి ఉద్యోగాలు కల్పించాలని అనుకోరు.
సోషలిస్టు దేశాల్లో…
సోషలిస్టు వ్యవస్థలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. సాంకేతికత, యాంత్రీకరణ పెరిగితే కార్మికుల పని భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. వారికి విశ్రాంతి సమయాన్ని పెంచుతారు. వేతనాల్లో కోత ఉండదు. అంటే సాంకేతిక మార్పుల కారణంగా సోషలిస్టు వ్యవస్థలో ఉత్పాదకత రెట్టింపు అవుతుంది. అదే సమయంలో నిరుద్యోగం పెరగదు. పని గంటలు తగ్గవు. వేతనాలూ తగ్గవు. కార్మికుల కొరత ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో సోవియట్ యూనియన్, ఒకప్పటి తూర్పు యూరోపియన్ సోషలిస్ట్ దేశాల్లో పూర్తి స్థాయిలో ఉపాధి లభించింది. దీనికి భిన్నంగా పెట్టుబడిదారీ దేశాల్లో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది.
హక్కుగా గుర్తిస్తే…
నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలంటే ఉపాధి కల్పనను ఓ హక్కుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి నప్పటికీ అందుకయ్యే ఖర్చు జీడీపీలో 3% మించదు. ఉపాధి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా వస్తూత్పత్తి పెరుగు తుంది. దీనివల్ల ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఓ వ్యక్తికి వేతనం ఇచ్చారనుకోండి.
అతను దానితో తన అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తాడు. వాటి ఉత్పత్తికి డిమాండ్ ఏర్పడుతుంది. ఇది మరి కొందరికి ఉపాధి చూపుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భాగం చాలా స్వల్పం. పైగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇందుకు పూనుకుంటుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రజలకు ఉపాధి హక్కు కల్పించాలంటే పార్లమెంటులో చట్టాన్ని చేయాల్సి ఉంటుంది. ఇందుకు పాలకులు సిద్ధపడతారా అన్నదే ప్రశ్న.