– ఎమ్‌డీ సజ్జనార్‌కు టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు ప్రకటించిన 2017 వేతన సవరణ పే స్కేల్ ఫిక్సేషన్‌లోని లోపాలను సవరించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం ఆయన కార్యాలయంలో అందచేసినట్టు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలని గతంలో తాము కోరామనీ, కానీ 2017 వేతన సవరణలో రూ.16,500 మాత్రమే పరిగణనలోకి తీసుకుని, వేతన సవరణ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2018లో నిర్ణయించిన కనీస వేతనం రూ.19వేలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇంక్రిమెంటు రేట్లు బేసిక్ పైన అన్ని స్థాయిల్లో 5 శాతం ఉండేలా చూడాలని కోరితే, పాత ఇంక్రిమెంట్లనే చిన్న చిన్న మార్పులతో సర్క్యులర్ విడుదల చేశారని తెలిపారు. వివిధ కేడర్లలోని ఉద్యోగులందరికీ దీనివల్ల నష్టం జరుగుతుందన్నారు. సీనియర్, జూనియర్ లను కూడా ఒకే స్కేలులో ఉంచారన్నారు. 2024 జనవరి డిఏ వెంటనే అమలు చేయాలని కోరారు. 2013 వేతన సవరణ బకాయిల బాండ్ల కాలపరిమితి ముగిసినా, ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదనీ, దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా, అమలు కాలేదన్నారు. ఈ అనుభవం దృష్ట్యా 2017 వేతన సవరణ బకాయిలు సొమ్ము లెక్కించి, ఏ కార్మికునికి ఎంత మొత్తం చెల్లించాల్సి వుంటుందో, ఎప్పుడు పేమెంటు చేస్తారో ధృవీకరిస్తూ అధికారికంగా కాపీలు ఇవ్వాలని కోరారు.