సాధారణంగా రాజకీయాలు ప్రభుత్వ పరిపాలనను శాసిస్తాయి. ప్రజాప్రభుత్వాలు విధానాలకు లోబడి పనిచేయాలి. ప్రతిపక్షం నిరంతరం సర్కారుపై నిఘా పెట్టడం, ఆందోళనలు, ఉద్యమాలు చేయడం సహజం. అధికారం కోసం అలవికాని హామీలిచ్చి పబ్బంగడుపుకునే ప్రభుత్వాలు ఎదురుదాడికి దిగడం, అవసరమైన సామ, దాన పద్దతులు వదిలేసి దండనకు తెగబడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించలేని నిస్సహాయత, ఆశక్తత ఉన్నప్పుడు ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు ప్రతిపక్షంపైనా, విధానాలను ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు, పార్టీలపై అభాండాలు వేయడం, అసత్య, ఆరోపణలు చేయడం నేడు దేశ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. హుందాతనం కొరవడుతుందని చెప్పడానికి ఈ పరిస్థితులే నిదర్శనం.
కేంద్రంలోని మోడీ సర్కారు ఇందులో అందేవేసిన చేయి. ప్రభుత్వ పాలనపరంగా జనం సమస్యలు పరిష్కరించ లేనప్పుడు రాజకీయ అలజడిని రేపడం నేడు బీజేపీ సర్కారు చేస్తున్న కుట్ర విద్య. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ సర్కారుపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలు ఉప్పెనలా లేచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సైతం ప్రశ్నించాయి. జీఎస్టీ పేర అడ్డగోలుగా రాష్ట్రాల నిధులు, అధికారాలను చెరబట్టిన మోడీ ప్రభుత్వం సమాఖ్య తత్వాన్ని బొందపెట్టి మరీ రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే చర్యలకు తెగించింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని సైతం ఇరుకునపెట్టేందుకు పూనుకుంది. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడమేగాక అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ నాలుగడుగులు ముందే ఉంటుంది. తద్వారా సమస్యలను పక్కదారి పట్టించే వ్యూహం అమలుచేస్తున్నది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్ల నిధులు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సాక్షాత్తు రాజ్యాంగ వ్యవస్థ పార్లమెంటులో కేంద్ర మంత్రి పచ్చి అబద్దం చెప్పడం, దాన్ని బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారంలో పెట్టడం వాస్తవాలను మరుగున తొక్కడమే. నిజాలు ప్రజల దృష్టికి పోకుండా చేయడమే. తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రజాసమస్యలపై చర్చకు బీజేపీ మోకాలడ్డింది. జమిలి ఎన్నికల బిల్లును పాస్ చేసుకునేందుకు హోంమంత్రి అమిత్‌షా అంబేద్కర్‌పై పరుషమైన వ్యాఖ్యలు చేసి జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో అలజడి చెలరేగింది. ఇదే అదనుగా జమిలీకి గ్రీన్‌సిగల్ ఇచ్చుకున్నారు. అదానీ అవినీతిపై దేశంలో అనేక విమర్శలు వచ్చి ఆందోళనలు జరిగినా, అమెరికాలో కేసు నమోదైనా ప్రధాని మోడీ నోరువిప్పకపోవడం విడ్డూరం.
స్వార్థ ప్రయోజనాలు రాజకీయాలతో జనంగోడు ఎజెండా కావడం లేదు. కాదు, కాదు కానియ్యడం లేదు. పరిపాలనలో బీజేపీ భావోద్వేగాలను పరకాయ ప్రవేశం చేయించడాన్ని ఎంతమాత్రం సహించకూడనిది. కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర రాజ్యాంగ సమస్థలను తమ మతోన్మాద రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నది. అధికారమే పరమావధిగా అడుగులేస్తున్నది. ఏదైనా ప్రజా సమస్య ముందుకొచ్చినప్పుడు అయోధ్య, కాశీ అంటూ సెంటిమెంటు తెర లేపుతున్నారు. రాజకీయాలతోపాటు ప్రభుత్వాల పరిపాలనలోనూ ఆరోగ్యకరమైన వాతావరణం కొరవడుతుడుతున్నది. హుందాతనం లోపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇటు పాలకపక్షం, అటు ప్రతిపక్షం నుంచి యువతకు, భవిష్యత్ తరాలకు ఎలాంటి విలువలు, ఆదర్శాలను వారసత్వంగా అందిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రధానంగా చట్టసభల్లో విధానాలపై సద్విమర్శలు చేసే బదులు వ్యక్తిగత దూషణలకు దిగడం సామాన్యుల సమస్యలపై చర్చలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. పథకాలు అమలుచేయలేక హైడ్రాను ముందుతెచ్చారనీ, అల్లు అర్జున్‌పై తప్పుడు కేసు పెట్టి రేవంత్ సర్కారు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీ చెప్పడం దొంగే దొంగా దొంగా అనే చందంగా ఉంది. సందట్లో సడేమియా పాత్రకే పరిమితమవుతున్న రాష్ట్ర బీజేపీ, కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించే ఆలోచనకు స్వస్తిచెప్పింది. స్థానిక పాలకపక్షంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బానికి అలవాటుపడింది. ఇక్కడి కేంద్ర మంత్రులు చేష్టలుడిగిపోయారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఆ పార్టీ బలాన్ని తగ్గించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. పారా హుషార్.