ప్రభుత్వ భూములను ఇండ్ల స్థలాలకు పంచండి

–  సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శ్రీనివాస్‌
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలో పలు గ్రామాల్లో పేదలకు సొంత ఇండ్లు కాని, స్థలాలు కాని లేవని, అట్టి పేదలకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఇండ్ల స్థలాలకు కేటాయించాలని, లేనియెడల పేదలతో కలిసి ఆయా భూములను ఆక్రమించుకుంటామని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్‌ హెచ్చరించారు. సోమవారం స్థానిక రావి వీరవెంకయ్య భవన్‌లో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లులేని పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. తుంబూరులోని సర్వే నెంబరు 34లో ప్రభుత్వానికి చెందిన భూమిని కొందరు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని, ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు ఇండ్ల స్థలాలకు పంచాలన్నారు. అలాగే సదాశివునిపాలెం సైతం ప్రభుత్వ భూమి ఉన్నప్పటికి పేదల ఇండ్ల స్థలాలకు పంచడం లేదన్నారు. తక్షణమే అధఙకార యంత్రాంగం స్పందించి గూడులేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండలంలో అనే గ్రామాల్లో పేదలు గూడులేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాలివ్వా లన్నారు. అలాగే స్థలాలున్న పేదలకు గృహలక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఇవ్వాలన్నారు. గృహలక్ష్మీ పథకం ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, ఐనంపూడి సనందనరావు, వేపులపాటి కుమాస్వామి, కృష్ణ, రాము, శ్రీను, సత్యవతి, మారేశ్వరి, పద్మ, వెంకటనర్సమ్మ పాల్గొన్నారు.