దైవాంశ..!

Divine material..!పెద్దాయన నిద్రలేచాడు. అప్పటికి ఎనిమిది గంటలు కావస్తోంది. మూడవసారి పీఠమెక్కాక నిద్ర కరువైంది. ఒక బాబు తర్వాత మరొక బాబు మాకు అది కావాలీ! ఇది కావాలి అంటూ పోరుపెడుతున్నారు! ఒక్కోసారీ ఇద్దరూ ఒకేసారి ఆ చెవిలో ఒకరు, ఈ చెవిలో మరొకరు ఏదేదో ఊదుతున్నారు! ఒకరిగాలి మరొకరికి తగులుతున్నా సరే పట్టించుకునే స్థితిలో వారులేరు! తాను అసలేలేడు! అందుకే మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలను కున్నాడు! అటూ ఇటూ చూశాడు! ఒక్క కెమెరా కూడా లేదు! యోగా చేయాలంటే కెమెరాలు ఉండాలి కదా! చప్పట్లు కొట్టాడు! కార్యాలయ ప్రముఖ్‌ వచ్చాడు! ఆ ప్రముఖ్‌కి పెద్దాయన మనసులో ఏముందో తెలుసుకోగల అతీతశక్తి ఉంది! అందుకే ఆయన్ను గుజరాత్‌ నుండి రప్పించుకున్నాడు పెద్దాయన.
ప్రముఖ్‌ వచ్చి రావటంతోనే పెద్దాయన మొఖంలోకి చూసి విషయం అర్థం చేసుకున్నాడు. వెంటనే ఏర్పాట్లు చేశాడు. డజను స్టిల్‌ కెమెరామెన్లు, మరో డజను వీడియోగ్రాఫర్లు వచ్చారు! అప్పటికే పెద్దాయన ట్రాక్‌సూట్‌ లోకి మారిపోయాడు! ఘాటింగ్‌ మొదలు పెట్టారు! ఒక ఫొటోగ్రాఫర్‌, ప్రముఖ్‌ చెవిలో ఏదో చెప్పాడు! దాంతో ప్రముఖ్‌ షూటింగ్‌ ఆపించాడు. పెద్దాయనకు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. అయితే ప్రముఖ్‌ వెళ్లి గోడ గడియారాన్ని కిందికి దించి టైము నాలుగు గంటలుగా మార్చాడు. పెద్దాయన ప్రముఖ్‌ను ప్రశంసాపూర్వకంగా చూశాడు. ప్రముఖ్‌ ఆనందానికి అవధులు లేవు. ఆ ప్రశంస భారతరత్నతో సమానం!
ప్రముఖ్‌ పెద్దాయన వేస్తున్న ఆసనాలను శ్రద్ధగా పరిశీలిస్తు న్నాడు. పెద్దాయన వేయవద్దని కోరుకుంటున్న ఆసనాలు రెండున్నాయి. అవి వజ్రాసనం, శీర్షాసనం! మూడవసారి పీఠమెక్కాక ఈ రెండు ఆసనాలు రోజంతా ఏదోవిధంగా వేస్తూనే ఉన్నాడు! అందువల్ల మళ్లీ యోగాలో కూడా ప్రత్యేకంగా వేయటమెందుకని ప్రముఖ్‌ ఆలోచన! పెద్దాయన కూడా ఆ ఆసనాలు వేయకుండానే యోగా ముగించి, ప్రముఖ్‌ వంక చూశారు! అంతే గ్రాఫర్లందర్నీ పంపించి ఒక్క ఫొటోగ్రాఫర్‌, ఒక్క వీడియో గ్రాఫర్‌ను ఉంచారు! ఇప్పుడిక ఇంటర్వూ!
ప్రఖ్యాత స్టంట్‌ కం కామెడీ హీరో క్షయకుమార్‌ వచ్చాడు. ఆయనకీ ఈ మధ్య సినిమాలేం లేవు! ప్రముఖ్‌, ఒక చీటీని క్షయకుమార్‌ చేతిలో పెట్టినాడు! పెద్దాయన్ను ఇంటర్వూ చేయటానికి క్షయకుమార్‌ సిద్ధమయ్యాడు.ఎప్పుడొచ్చాడో తెలియదు కాని పెద్దాయన కలర్‌ఫుల్‌ సూట్‌ వేసుకుని వచ్చి కెమెరాముందు కూర్చున్నాడు. ఇంటర్వూ ప్రారంభమైంది!
”మూడవసారి పీఠమెక్కిన సంధర్భంలో మీకు శుభాకాంక్షలు!” అంటూ క్షయకుమార్‌ పెద్ద గులాబీల గుత్తిని పెద్దాయన కందించాడు! పెద్దాయన దాన్ని అందుకుంటూ ”ధన్యవాదాలు” అన్నారు!
”ఢిల్లీలో వరదలు వచ్చి అల్లకల్లోలంగా ఉంది! సర్‌!” అన్నాడు క్షయకుమార్‌ ”అవును! స్కూళ్లు కూడా బందు” చేశారు! పిల్లల చదువులు పాడవుతాయని తెలిసి స్కూళ్లు బంద్‌ చేయటం ఎంత బాధాకరం! అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్‌ను బురదపాలే కాక వరదపాలు చేస్తున్నది! ఇది ఎంతో బాధాకరం!” అని అంటుంటే పెద్దాయన గొంతు పూడుకు పోయింది! క్లోజప్‌ షాట్‌లో ఖరీదైన కండ్లద్దాల వెనక వేలుపెట్టి కంటి నుండి ఉబికి వస్తున్న నీటి చుక్కను పెద్దాయన సుతారంగా తుడుచుకున్నాడు!
ప్రఖ్యాత నటుడైన క్షయకుమార్‌ పెద్దాయన్ను చూసి షాక్‌ తిన్నాడు! ఆ తర్వాత తాను కూడా వలవలా ఏడ్చాడు! తర్వాత తేరుకున్నాడు. ఇంటర్వూ కొనసాగించటానికి తలెత్తి చూశాడు! పెద్దాయన అప్పటికే డ్రెస్‌ మార్చుకుని లాన్‌లో కెమెరా ముందు నిలబడి ఉన్నాడు! పాపం క్షయకుమార్‌ పరుగెత్తాడు.
”ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాల విద్యార్థుల ఆనందహేల గురించి పంచుకోవాలనుకుంటున్నాను సర్‌! క్లాస్‌ రూములో పిల్లలు ఈత కొడుతూ ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉన్నారో!” అంటూ క్షయకుమార్‌ ఒక వీడియో పెద్దాయనకు చూపించాడు!
ఆ వీడియో చూసి పెద్దాయన చిన్న పిల్లాడిలా ఆనందపడ్డాడు! ఆ క్షణం పెద్దాయన కూడా ఈత కొట్టేలా కనిపించాడు! అంతగా ఉల్లాసపడ్డాడు!
”ఉత్తరప్రదేశ్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంది కదా! అందుకే పిల్లలకు కూడా రెండు ప్రయోజనాలు అందిస్తున్నాం! వర్షం లేనపుడు అది తరగతి గది! వర్షం పడితే అది స్విమ్మింగ్‌ పూల్‌! పైసా ఖర్చు లేకుండా స్విమ్మింగ్‌ నేర్చుకుంటున్నారు! దీనివల్ల భవిష్యత్‌లో కూడా రెండు ప్రయోజనాలు కలుగుతాయి! వరదలు వచ్చినపుడు బ్రిడ్జిలు కూలిపోయినా ఈదుకుంటూ నదులు దాటేయవచ్చు! రెండవదేమిటంటే ఇందులో ఈత నేర్చుకున్న చిన్నారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించవచ్చు అందుకోసం భగవద్గీతను కూడా గురువులతో చెప్పిస్తాం! ఇలా ప్రతి దాంట్లో రెండు ప్రయోజనాలు ఉంటాయి. అందుకే దేశమంతా డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలి!” అన్నారు పెద్దాయన.
పెద్దాయన దూరదృష్టికి క్షయకుమార్‌ కండ్లు బైర్లు కమ్మాయి! తేరుకుని చూసేసరికి పెద్దాయన సూటు మార్చుకుని కెమెరా ముందు రెడీగా ఉన్నాడు.
”ఒలింపిక్స్‌లో మనుబాకర్‌ కాంస్య పతకం సాధించినందుకు మీరు ఫోన్‌చేసి అభినందించినందుకు దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి! బేటీలపై మీ ప్రేమ చాలా గొప్పది సర్‌!” అన్నాడు క్షయకుమార్‌ చేతులు జోడించి తన్మయత్వంతో.
”మా సర్కార్‌ ఆటలని, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ఎంతో సపోర్టు చేస్తుంది! ఆ సపోర్టే తనకి కాంస్య పతకం తెప్పించిందని మను నాతో ఫోన్లో చేప్పింది! ఆమెకి నా అభినందనలు!” అన్నాడు పెద్దాయన.
”భగవద్గీత కూడా తనకు స్పూర్తినిచ్చిందని అందుకే కాంస్య పతకం గెలిచానని చెప్పినట్లు మీడియాలో వచ్చింది! మను భగవద్గీత చదవటానికి మీరే స్ఫూర్తి అనుకుంటున్నాను! మరో విషయం కూడా నాకర్థమైంది సర్‌! బంగారం, వెండి పతకాలు సాధించిన వాళ్లు కూడా భగవద్గీతను ఇంగ్లీషులో చదివి ఉంటారు! బయటకు చెప్తే తమ విజయ రహస్యం అందరికీ తెలిసిపోతుందని చెప్పలేదనుకుంటాను సర్‌!” అన్నాడు క్షయకుమార్‌.
క్షయకుమార్‌వంక అభినందనపూర్వకంగా చూశాడు పెద్దాయన. ఆస్కార్‌ వచ్చినంత ఆనందపడ్డాడు క్షయకుమార్‌.
క్షయకుమార్‌ తన ప్రశ్నను సంధించబోయాడు. ప్రముఖ్‌ ఒక చీటీని క్షయకుమార్‌కి అందించాడు.
”సర్‌! మీరు కొత్తగా కట్టించిన పార్లమెంటులో ఆకాశం నుండి నీటి ప్రవాహం కిందికి జాలువారుతోందని! దీన్ని ప్రతిపక్షాలు లీకేజీ అంటున్నారని ఇప్పుడే అందిన వార్త! దీన్ని ఎలా చూస్తారు సర్‌!” అన్నాడు క్షయకుమార్‌.
ప్రశ్న పూర్తికాకుండానే పెద్దాయన ముఖంలో రంగులు మారాయి. మొఖం కాంతివంతమయ్యింది! పెద్దాయన సంభ్ర మాశ్చర్యాలతో ముందుకు కదిలాడు! ఆకాశంలోకి చూస్తూ చేతులు జోడించాడు! అలాగే ముందుకు సాగాడు! వెంటనే విదేశీ రేంజ్‌ రోవర్‌ కారు వచ్చింది! పెద్దాయన్ను ఎక్కించుకుని పార్లమెంటులోకి ప్రవేశించింది! క్షయకుమార్‌, ప్రముఖ్‌ ఫాలో అయ్యారు.
పెద్దాయన జోడించిన చేతులతోనే పార్లమెంటులోకి నడిచాడు! నేరుగా ఆకాశంలో నుండి పడుతున్న నీటిధార వైపు సాగారు! ఆ నీటిధార కింద ఎవరో పామరుడు ఒక బకెట్‌ పెట్టి ఉంచాడు! వెనక నుండి వచ్చిన ప్రముఖ్‌ బకెట్‌ తీసి ఆవతలకి విసిరేశాడు! పెద్దాయన ఆ నీటిధార ముందు మోకరిల్లాడు! ఆ నీటిని కండ్లకద్దుకుని తలపై చల్లుకున్నాడు! ఆ తర్వాత నీటిధారకి సాష్టాంగ నమస్కారం చేశారు! ఈలోగా కొత్త పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం ”సెంగోల్‌”ను ప్రముఖ్‌ తీసుకొచ్చాడు. పైనుండి పడుతున్న నీటిధారలో నుండి కొన్ని బిందువులు తీసుకుని సెంగోల్‌ పై చిలకరించి, ఆ తర్వాత పెద్దాయన సెంగోల్‌ను కూడా కండ్లకద్దుకున్నారు!
ఆ ప్రాంతానికి ఎప్పుడో చేరుకున్న మీడియా ఈ అపురూప దృశ్యాన్ని లైవ్‌లో ప్రపంచానికి చూపుతోంది!
పెద్దాయన మాట్లాడటం మొదలుపెట్టారు! ”నేను వారణాసి లో గెలిచాను! కానీ విశ్వనాథుడు నన్ను ఆశీర్వదించి, నాకు, ఈ పదవిని చేపట్టమని బాధ్యత పురమాయించాడు! అప్పుడే నాకు అన్పించింది! నేను అందరి లాంటి మనిషిని కానని! అందరిలా పుట్టలేదని! ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పాను! కాని కొందరు నాస్తికులు దైవద్రోహులు నమ్మలేదు! అందుకే, నేను కట్టించిన ఈ పార్లమెంటులోకి ఆకాశం నుండి నేరుగా గంగామాత ప్రవహించి నేను మానవాతీ తుడనని, దైవాంశసంభూతుడనని మరోసారి నిరూపించింది!” అంటూ పారవశ్యంతో కండ్లు మూసుకున్నారు.