కార్పొరేట్ లకు అనుగుణంగా కార్మిక చట్టాల విభజన

– ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
శతాబ్దకాలపు పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోది ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా కోడ్లుగా విభజించిందని ఏఐటీయూసీ రాష్త్ర కార్యదర్శి విలాస్ అన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. సంఘం పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్మిక ఉద్యమ వీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.  1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ బ్రిటీష్ పాలనలోనే 37 కార్మిక చట్టాలను సాధించిందని సంఘం రాష్త్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. స్వాతంత్య్రానంతరం మరో 10 చట్టాల సాధించుకోవడంలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. కార్మికులను సంఘటితం చేసి హక్కుల కోసం పోరాడే స్పూర్తిని కల్పించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. 55 కోట్ల కార్మికుల పక్షాన ఏఐటీయూసీ జరిపిన పోరాటాలకు మహామహులు నేతృత్వం వహించారన్నారు. సుదీర్ఘ పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న 47 కార్మిక చట్టాలను మోది ప్రభుత్వం కార్పోరేట్ల కోసం 4 కోడ్లుగా విభజించి అమలు కోసం రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు. కాగా అటు తాంసి మండల కేంద్రంలోనూ ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా నాయకుడు తోట నరేందర్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, నాయకులు గజెంగుల రాజు, కుంటాల రాములు, కాంతారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, దత్తు, మహేందర్, వివిధ పార్టీల నాయకులు కృష్ణ, గోవర్దన్రెడ్డి, రామన్న యాదవ్ పాల్గొన్నారు.