జకోవిచ్‌ నిష్క్రమణ

Djokovic's exit– రెండో సీడ్‌కు ఊహించని భంగపాటు
– మూడో రౌండ్లో సెర్బియా యోధుడి ఓటమి
– యు.ఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2024
న్యూయార్క్‌లో సంచలనాల మోత మోగుతోంది. ప్రతీ ఏడాది మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్లకు పరాజయాలు ఎదురువుతుండగా.. యుఎస్‌ ఓపెన్‌లో ఈసారి పురుషుల సింగిల్స్‌లో దిగ్గజాలు వరుసగా నిష్క్రమిస్తున్నారు. కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) రెండో రౌండ్లో పరాజయం చవిచూడగా.. సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో కంగుతిన్నాడు. కెరీర్‌ 25వ, టెన్నిస్‌ ఓపెన్‌ చరిత్రలో రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసి న్యూయార్క్‌కు వచ్చిన జకోవిచ్‌కు ఓటమి తప్పలేదు. అల్కరాస్‌, జకోవిచ్‌ ఓటమితో మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ రేసు సమీకరణం ఆసక్తికరంగా మారింది.
న్యూయార్క్‌ (అమెరికా) : యు.ఎస్‌ ఓపెన్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మొనగాడు, ఆధునిక టెన్నిస్‌ శకంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) 25 ఏండ్ల ఆస్ట్రేలియా కుర్రాడి చేతిలో కంగుతిన్నాడు. కెరీర్‌ 25వ గ్రాండ్‌స్లామ్‌ విజయంతో ఆల్‌టైమ్‌ చరిత్ర సష్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూయార్క్‌ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో రెండో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 4-6, 4-6, 6-2, 4-6తో పరాజయం పాలయ్యాడు. వరల్డ్‌ నం.25, అన్‌సీడెడ్‌ అస్ట్రేలియా ఆటగాడు అలెక్సీ పాపిరిన్‌ నాలుగు సెట్ల సూపర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌పై కెరీర్‌ అత్యుత్తమ విజయం నమోదు చేశాడు. సుమారు మూడున్నర గంటల పాటు నిలకడగా అద్భుత ప్రదర్శన చేసిన అలెక్సీ.. యుఎస్‌ ఓపెన్‌లో అతిపెద్ద విజయం సాధించాడు.
జకోవిచ్‌కు భంగపాటు :
హార్డ్‌కోర్టుపై నొవాక్‌ జకోవిచ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. గత 17 ఏండ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే క్వార్టర్‌ఫైనల్‌కు చేరకుండా ఇంటి ముఖం పట్టాడు. ఈ ఏడాది ఒలింపిక్స్‌ పసిడి పతకంతో జోరందుకున్న జకోవిచ్‌కు.. యు.ఎస్‌ ఓపెన్‌లో ఊహించని ఓటమి ఎదురైంది. జకోవిచ్‌ సుదీర్ఘ కెరీర్‌లో 2024ను ఒక్క గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సైతం లేకుండా ముగించాడు. 2002 తర్వాత బిగ్‌ 3 ప్లేయర్లు రోజర్‌ ఫెడరర్‌, రఫేల్‌ నడాల్‌, నొవాక్‌ జకోవిచ్‌లలో ఎవరూ ఒక్క సింగిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సైతం నెగ్గలేదు. ఆస్ట్రేలియా కుర్రాడు అలెక్సీ ఎవరూ ఊహించని ఫలితాన్ని రాబట్టాడు. నొవాక్‌ జకోవిచ్‌కు ఏ సెట్లోనూ అవకాశం ఇవ్వలేదు. తొలి రెండు సెట్లను 6-4, 6-4తో గెల్చుకున్న అలెక్సీ.. మూడో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. ఓ సెట్‌ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న జకోవిచ్‌కు అలెక్సీ ఏమాత్ర తలొగ్గలేదు. 6-4తో నాల్గో సెట్‌ను సొంతం చేసుకుని డిఫెండింగ్‌ చాంపియన్‌ డ్రీమ్‌ గ్రాండ్‌స్లామ్‌ వేటకు తెరదించాడు. మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో జకోవిచ్‌ అంచనాలను అందుకోలేదు. 25 ఏండ్ల కుర్రాడి ముందు జకోవిచ్‌ తేలిపోయాడు. అలెక్సీ 15 ఏస్‌లు కొట్టగా.. జకోవిచ్‌ 16 ఏస్‌లు సంధించాడు. లెక్సీ ఆరు డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడగా, జకోవిచ్‌ 14 డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడ్డాడు. బ్రేక్‌ పాయింట్ల పరంగా అలెక్సీ ఆరు సార్లు జకోవిచ్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేయగా… అలెక్సీ సర్వ్‌ను జకోవిచ్‌ నాలుగు సార్లు మాత్రమే బ్రేక్‌ చేశాడు. పాయింట్ల పరంగా 130-127తో అలెక్సీ పైచేయి సాధించాడు. అలెక్సీ 20 గేమ్‌ పాయింట్లు గెలుపొందగా జకోవిచ్‌ 18 గేమ్‌ పాయింట్లతో సరిపెట్టుకున్నాడు.
పురుషుల సింగిల్స్‌లో నాల్గో సీడ్‌, జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ముందంజ వేశాడు. మూడో రౌండ్లో అలవోక విజయం సాధించి ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు థామస్‌ మార్టిన్‌పై అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ గెలుపొందాడు. 5-7, 7-5, 6-1, 6-3తో అలెగ్జాండర్‌ అదరగొట్టాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 12 ఏస్‌లు కొట్టగా.. థామస్‌ మార్టిన్‌ 5 ఏస్‌లు సంధించాడు. ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జ్వెరెవ్‌ నాల్గో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఇటలీ ఆటగాడు లోరాంజో ముసెటి పరాజయం పాలయ్యాడు. 2-6, 6-3, 3-6, 6-7(4బి7)తో బ్రాండన్‌ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా వెటరన్‌ స్టార్‌ మడిసన్‌ కీస్‌ సైతం ఇంటిబాట పట్టింది. 7-6(7-5), 5-7, 4-6తో ఎలిసీ మెర్టెన్స్‌ చేతిలో ఓటమి చెందింది.