
మండల కేంద్రంలో మంగళవారం ఆర్మూర్ డిఎల్ పిఓ శివ క్రిష్ణ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన నర్సరీని, వైకుంఠధామాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని, డంపింగ్ యార్డ్ ను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఉదయం సాయంత్రం వేళల్లో మొక్కలకు నీటిని అందించాలన్నారు. వైకుంఠధామంలో అంత్యక్రియల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆయన ప్రజలు పల్లె ప్రకృతి వనానికి వచ్చి సేద తీరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ కు తరలించాలని, గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అంతకుముందు ఆయన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఆదాయవ్యాల గురించి కార్యదర్శులు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, తదితరులు ఉన్నారు.