వారం రోజుల్లో డీఎంఈ కార్యాలయం ఘెరావ్‌

– తెలంగాణ టీచింగ్‌ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే వారం రోజుల్లో డీఎంఈ కార్యాలయాన్ని ఘెరావ్‌ చేయనున్నట్టు తెలంగాణ టీచింగ్‌ వైద్యుల సంఘం తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌ కోఠిలోని ఐఎంఏ కార్యాలయంలో ఆ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 32 వైద్య కళాశాలల నుంచి దాదాపు 200 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నుంచి అడిషనల్‌ డీఎంఈ స్థాయి వరకున్న టీచింగ్‌ వైద్యులు హాజరై సమస్యలపై చర్చించారు. బదిలీలు, పీఆర్సీ ఎరియర్స్‌, పెరిఫెరల్‌ కాలేజీల్లో ఉన్న సమస్యల విషయంలో స్పందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి టార్గెట్లు నిర్ణయించడమే కకుండా వైద్యుల సమస్యలపై కూడా చర్చించాలని కోరారు. దేశంలోనే ఆరోగ్య రంగంలో తెలంగాణ ఉత్తమ స్థానంలో ఉండటానికి వైద్యుల సమిష్టి కృషి కారణమని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది సమస్యలపై నిరసన తెలిపిన సమయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఇచ్చిన భరోసాతో వెనక్కి తగ్గినప్పటికీ, అందులో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు డాక్టర్‌ అన్వర్డా, ప్రదాన కార్యదర్శి డాక్టర్‌ జలగం తిరుపతి రావు, ఉపాధ్యక్షులు డాక్టర్‌ కిరణ్‌ మాదాల, డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి, కోశాధికారి డాక్టర్‌ కిరణ్‌ ప్రకాష్‌, రీజనల్‌ సెక్రెటరీ డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.