– ఢిల్లీ ఆందోళనలో మేమూ పాల్గొంటాం : పినరయి విజయన్‌కు స్టాలిన్ లేఖ
తిరువనంతపురం : ఫెడరలిజం పరిరక్షణకు కేరళ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనకు తమిళనాడు సీఎం స్టాలిన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన ఫెడరలిజం ప్రాథమిక సూత్రం తీవ్ర ముప్పులో ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కేరళ సీఎం విజయన్‌కు స్టాలిన్ లేఖ పంపించారు. కేరళకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష ప్రదర్శించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తప్పుపట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళ సర్కారు తీసుకున్న చట్టపరమైన చర్యలను ఆయన సమర్ధించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టబోయే ఆందోళనలో డీఎంకే కూడా భాగస్వామి అవుతుందని లేఖలో స్టాలిన్ తెలిపారు. సహకార ఫెడరలిజాన్ని నెలకొల్పి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని సాధించేంత వరకూ మన గళం ఆగకూడదని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న వారందరూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం కలసికట్టుగా నిలవాలని మమతా బెనర్జీ, పినరయి విజయన్ తదితర నేతలను కోరారు. ‘రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్న నినాదపు వేడిని ఫాసిస్టు బీజేపీ ఎప్పటికీ చల్లార్చలేదు. ఆర్థిక, పాలనా వ్యవహారాలలో రాష్ట్రాలకు ఉన్న హక్కులను పరిరక్షించాల్సిన అవసరముంది. అందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని డీఎంకే ప్రతినిధి శరవరణ్ చెప్పారు. ‘రెండు తీవ్రమైన తుపానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాము. అయితే కేంద్రం కాలయాపన చేస్తోంది. తమిళనాడుకు బదులు ఇతర రాష్ట్రాలన్నింటికీ సాయం అందిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ఆర్థిక పరమైన స్వయం ప్రతిపత్తి ఉంటే కేంద్రాన్ని అడగాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. సంక్షోభ సమయంలోనూ కేంద్రం ఆదుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రాల రుణ పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం డిసెంబరులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్య రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో పరోక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందని తెలిపింది. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని విమర్శించింది.