– లేదంటే ఎన్జీఆర్‌ఐతో రీసర్వే చేయాల్సి వస్తుంది : హైడ్రా కమిషనర్ రంగనాథ్
– చెరువు స్థలంలో రోడ్డు వేసేందుకు
– ఎజెండా ఎలా పెట్టారని కమిషనర్‌పై ఆగ్రహం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెం.185లోని పెద్ద చెరువును సమగ్రంగా సర్వే చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. లేదంటే ఎన్జీఆర్‌ఐతో రీసర్వే చేయాల్సి వస్తుందన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రెండ్రోజులుగా సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థలాన్ని బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు స్థలంలో మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఎజెండాలో ఎలా పెడతారని, నిధులు ఎలా ఇస్తారని, రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించారు. థర్డ్ పార్టీ అంటూ ఆయన సమాధానం చెబుతుండగా.. థర్డ్ పార్టీ ఎవరంటూ వారిపై కేసు పెట్టాలని ఆదేశించారు. అధికారులు సర్వే త్వరగా పూర్తి చేసి చెరువు, సమీపంలో ఉన్న పట్టా భూమి బౌండరీని ఫిక్స్ చేయాలన్నారు. సర్వే నెం.185లోని చెరువు విస్తీర్ణం 95 ఎకరాలకు సంబంధించిన హద్దులు గుర్తించి బౌండరి ఫిక్స్ చేయాలన్నారు. చెరువుకు సరిహద్దుల్లో మాత్రమే రోడ్డు వేసుకోవాలన్నారు. చెరువులో ఉన్న రోడ్డును తొలగించాలని ఆదేశించారు.