– ప్రజావాణిలో, రేవంత్ రెడ్డి నివాసం వద్ద స్టాఫ్ నర్సుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతంలో స్టాఫ్ నర్సుల నియామకాల సమయంలో ఎంపికైన తమను పక్కన పెట్టారనీ, తమకు న్యాయం చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు విజ్ఞప్తి చేశారు. మంగళ వారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద, జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద వారు వినతిపత్రాలు సమర్పించారు. అంతకు ముందు తమ సమస్యలతో కూడిన బ్యాన ర్‌ను చేతబట్టి, ప్ల కార్డులను ప్రదర్శించారు. వయోపరిమితి దాటిపోతున్నదనీ, తమ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని వారు కోరారు. పలువురు బాధి తులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శోభారాణి మీడి యాతో మాట్లాడుతూ, 2017లో 3,311 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. 2,418 మందిని ఎంపిక చేసి బడ్జెట్ లేదంటూ 893 పోస్టులకు అపాయి ంట్‌మెంట్ లెటర్స్ ఇవ్వలేదని తెలిపారు. తమను నిరుద్యోగులుగానే ఉంచారని తెలిపారు. గతంలో అనేక సార్లు టీఎస్ పీయస్సీకి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలి సేందుకు ప్రయత్నిస్తే నాడు పోలీసులు అరెస్టు చేసి తమ గొంతు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి తమకు మద్ధతుగా నిలిచారని గుర్తుచేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తమ పోస్టులను తమకివ్వాలని కోరారు.