– 25 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి హిందీ పండిత్ పరిరక్షణ సమితి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని హిందీ ఉపాధ్యాయ అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ హిందీ పండిత్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవోనెంబర్ 25ను రద్దు చేయాలనీ, లేదంటే సవరించాలని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ సమితి నాయకులు ఎం రవి, నసీరా, విజయలక్ష్మి, సలీమా, రామలక్ష్మి, రామ్‌సింగ్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
జీవోనెంబర్ 1415ను యథాతధంగా అమలు చేయాలనీ, హిందీ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలనీ, కటాఫ్ తేదీని ప్రకటించాలని కోరారు. హిందీ విద్వాన్, మధ్యమ (విశారద్) హిందీ ధ్రువపత్రాలతో తాము హిందీ ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశామని వివరించారు. మిందీ విద్వాన్, మధ్యమ (విశారద్) కోర్సులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని గుర్తు చేశారు. ఆ ధ్రువపత్రాలపై 2013 ఎల్పీసెట్ కౌన్సెలింగ్ సమయంలో వివాదం ఏర్పడితే నాటి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిందని తెలిపారు. వాటిని పూర్తిస్థాయి డిగ్రీ ధ్రువపత్రాలుగా పరిగణించలేం కానీ హిందీ చదువుల నిమిత్తం మాత్రమే పనిచేస్తాయని నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. డీఎస్సీ హిందీ ఉపాధ్యాయ పోస్టులకు వారు అనర్హులంటూ ప్రకటించలేదని వివరించారు. కొద్ది మంది ప్రయోజనాల కోసం తెచ్చిన 25 జీవో వల్ల సుమారు 30 వేల మంది హిందీ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల హిందీ ఉపాధ్యాయ పోస్టులకు పాత నిబంధనలతో 1:2 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా తమనూ ఎంపిక చేయాలని కోరారు. డీఎస్సీ హిందీ ఉపాధ్యాయ పోస్టులకు విద్వాన్, మధ్యమ (విశారద్) ధ్రువపత్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.