పౌర హక్కుల కోసం పనిచేస్తున్న ఒక సంఘం ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి నేను హాజరయ్యాను. సమావేశానికి హాజరైన వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారన్న విషయాన్ని మొదట మాట్లాడిన వక్త నిర్వాహకుల దష్టికి తెచ్చాడు. ఇలాంటి సమావేశంలో హిందు వుల్ని కూడా చేర్చేందుకు నిర్వాహకులు ప్రయత్నించాలి, లేకుంటే ఆ పోరాటం ముస్లింలు చేస్తున్న ముస్లింల పోరాటం మాత్రమే అవుతుందని, ఇది, సంకుచితంగా కనపడేలా చేస్తుందని అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం, అది సంపూర్ణమైన లేదా మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహించే సమావేశం కాకుండా కేవలం సమాజంలోని ముస్లింలకు చెందింది గానే ఉంటుంది. తర్వాత ఆయన, కేవలం ముస్లింల హక్కులు మాత్రమే ఉల్లంఘనకు గురికావడం లేదనీ, అనేక ప్రాంతాలకు చెందిన దళితులు, హిందువుల హక్కులు కూడా ఉల్లంఘనకు గురవుతున్నాయనీ, దానిపై కూడా దష్టిని కేంద్రీకరించాలని అన్నాడు. ఆయన మాట్లాడిన విషయం గురించే ఆలోచించాను.
మొదటిది, సమావేశానికి హాజరైన వారు ముస్లింలే ఎక్కువగా ఉంటే ఆ సమావేశం ఎందుకు అసంపూర్ణమవుతుంది? 99 శాతం మంది హిందువులు హాజరైన ఏ సమావేశం గురించి కూడా మనం ఇలానే మాట్లాడగలమా? అలాంటి సమావేశంలో, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఎందుకు లేరని మనం అడగం. కానీ 99 శాతం ముస్లింలు ఉండే సమావేశంలో హిందువులు హాజరు కాలేదనే విషయం ప్రము ఖంగా కన్పిస్తుంది. ఒకవేళ ఆ సమావేశంలో ముస్లింలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, అప్పుడు హిందువులు ఆ నిర్ణయంలో భాగస్వాములు కాలేదు కాబట్టి దాన్ని అసంపూర్ణమైన నిర్ణయం గానే పరిగణిస్తారా? నేను ఒక విషయం ఒప్పుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చేయాలని కోరుతూ నన్ను పాట్నాకు ఆహ్వానించారు. నేను మీటింగ్ హాలుకు చేరుకునే సమయానికి, అక్కడ హాజరైన వారిలో 99 శాతం మంది ముస్లింలే అని తెలిసింది. అదే ప్రాంతంలో ఇంతకు ముందు నిర్వహించిన డజన్ల కొద్ది అలాంటి సమావేశాల్లో 99 శాతం మంది హిందువులే కాబట్టి హాజరు చాలా కొత్తగా ఉందని నేనెప్పుడూ అనుకోని విషయం గురించి ఆలోచించాను.
ఈ ఆలోచనా విధానం ఖచ్చితంగా మతవాదులుగా ముద్ర ాపడిన వారిది కాదు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. తమను తాము తార్కిక, లౌకికవాదులని చెప్పుకునే వారిలో కూడా మతతత్వం సూక్ష్మంగా ఉంటుందని అస్ఘర్ అలీ ఇంజనీర్‌ను ఉదహరించాడు. ఒకరి మతం ఉనికిని ‘సాధారణమైనదిగా’ అంగీకరిస్తూ, మరొకరిది అలా కాకుండా ఉండడం అంటేనే మనలో మతపరమైన చీడ ఉందా ఏమిటనే విషయాన్ని తెలియజేస్తుంది.
సమావేశంలో పౌర, మానవ హక్కులపై చర్చ నడిచింది. అసలు నేటి భారతదేశంలో అన్ని రంగాల్లో హక్కులు హరించబడుతున్నది ఏ మతంలో అని అడగాల్సిన అవసరం ఉందా? ఎవరి ఇండ్లు, ఎవరి దుకాణాలు నేలమట్టమవుతున్నాయి? ఎవరి ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి? ఎవరు అరెస్ట్ అవుతున్నారు? ఎవరికి వ్యతిరేకంగా చట్టం తరువాత చట్టాన్ని ప్రయోగిస్తున్నారు? ఎవరికి వ్యతిరేకంగా ఈ దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు నిరంతరం ద్వేషపూరిత ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి? ఏ జాతి సంహారం కోసం బహిరంగంగా నినాదాలిస్తున్నారు? ప్రతీ రోజు వినాశన ముప్పును ఎదుర్కొంటున్న మతం ఏది? ఏ మతం నిరంతర ద్వేషపూరిత ప్రచారాలకు గురవుతుంది? అన్ని ప్రాంతాల్లో ఒక క్రమ పద్ధతిలో దాడులకు గురవుతున్నది ముస్లిం సమాజం మాత్రమే అనేది నిజాయితీతో కూడిన సమాధానం.
నేడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక భావజాలాన్ని విశ్వ సించి, ప్రకటించే భారతీయ జనతాపార్టీ చేతుల్లో ఉందనడంలో ఏమైనా సందేహం ఉందా? ఈ పార్టీకి చెందిన ఇతర నాయకులతో పాటు ప్రధానమంత్రి కూడా తన బహిరంగ సభల్లో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విషయాన్ని గడిచిన పదేళ్ళుగా మనం చూడడం లేదా? ఇండ్లు ధ్వంసం చేసినప్పుడు, హత్యలకు, ద్వేషానికి గురైనపుడు, బాధితులు ఖచ్చితంగా ప్రతిస్పందిస్తారు. వారు కోర్టుకు వెళ్లి, న్యాయవాదులను నియమించుకొని, అరెస్టయిన వారి సంబంధీకుల బెయిల్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరులు వారికి అండగా నిలబడాలి. కానీ ఇతరులు వారి బాధ్యతను నెరవేర్చేంత వరకు, బాధితులు అప్పటిదాకా ఎదురు చూడాలా?
కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలిపేందుకు ఏకమైనప్పుడు కూడా ఈ ప్రశ్న తలెత్తింది. పౌరసత్వ చట్టంలో సవరణ, జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్సీ) ప్రకటనలు ముస్లింలలో భయాందోళనలు సష్టించాయి. ఈ చట్టం భారతదేశ లౌకిక సూత్రానికి వ్యతిరేకం. ఈ కారణంగా ముస్లిమేతరులు కూడా దీనిని వ్యతిరేకించాల్సి వచ్చింది. అయితే ఈ చట్టం ముస్లింలలో భయం, ఆందోళనలు సష్టించలేదనేది కూడా వాస్తవం. అందుకు కారణం లేకపోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించి, అమలు చేసిన వారు ఎప్పటికీ తమ ముస్లిం వ్యతిరేకతను దాచుకోరు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ప్రచురణ తరువాత అస్సాంలో ముస్లింల కంటే ఎక్కువగా హిందు వులే రిజిస్టర్ నుండి మినహాయించబడినట్టు కనుగొన్న విషయం కూడా వాస్తవమే. కానీ ప్రభుత్వం, నాయకులు మాత్రం తమకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌లో స్థానం లభిస్తుంది అనీ, ఆ జాబితాలో చేర్చిన వారిని బయటకు పంపిస్తారని అన్నారు. సందేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మరి ఎన్‌ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టాల సైద్ధాంతిక అర్థం, సంకేతాలు ఏమిటి?
భయపడిన వారంతా వీధుల్లోకి వచ్చారు. వారిలో చాలామంది ముస్లింలే. కొన్ని ప్రాంతాల్లో ముస్లిమేతరులు కూడా వారితో చేరారు. అయితే మనందరికీ తెలిసిన విధంగా, ఈ చట్టం ద్వారా భారతదేశంలో వారి ఉనికి, వారి స్థానం విషయంలో హిందువులు ఎలాంటి ముప్పును ఎదుర్కొనలేదు కాబట్టి ఆ నిరసనల్లో కలిసేందుకు హిందువులు ఎలాంటి ఆసక్తి చూపలేదు. షాహీన్ బాగ్ నిరసనల్లో ఎక్కువగా ముస్లిం మహిళలే భాగస్వాములయ్యారు. నేను పూణేలో అలాంటి ఒక నిరసన నుండి తిరిగొచ్చే క్రమంలో, అలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎప్పుడైనా ఆలోచించావా అని నేను ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ను అడిగితే, అది ‘వారి సమస్య’ అని సమాధానం ఇచ్చాడు. నిరసనల్లో కూర్చున్న ప్రజల ఆందోళనను అతడు అర్థం చేసుకోలేక పోయాడు. సముచితం కాకపోయినా, ఇదొక సహజ ప్రతిస్పందన. కానీ ఈ సంఘటన నుండి మనం ఎలాంటి నిర్ధారణకు వచ్చాం? కారు డ్రైవర్ లాంటి వారు, వారితో కలిసేంత వరకు ముస్లింలు నిరసనలు చేపట్టాల్సిందేనా?
ఎస్సీ, ఎస్టీ (దారుణ కత్యాల నిరోధక) చట్టం నిర్వీర్యమైనప్పుడు దళితులు నిరసిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఆ నిరసన కార్యక్రమాల్లో దళితేతరులు లేరు. కానీ వారి నిరసన చర్యలు తప్పు అని ఏ ఒక్కరూ అనలేదు. ఎందుకు దళితులు మాత్రమే నిరసిస్తున్నారని అడగలేదు. అన్యాయం జరిగిందని వారు భావించారు కాబట్టి వారే వీధుల్లోకి వచ్చారు. ‘బ్లాక్ లైవ్జ్ మ్యాటర్’ ఉద్యమం వలె. దానిలో నల్ల జాతీయులు ఉన్నారు, వారే నాయకత్వం వహించారు.అక్కడ నల్ల జాతీయులే ఎందుకు ఉన్నారు, వారే ఎందుకు నాయకత్వం వహిస్తున్నారని ఎవరూ అడగలేదు. ఇతర జాతీయులు కూడా దానిలో చేరారు. ఉద్యమం యొక్క నలుపు ప్రముఖమైనది, సమస్య కాదు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరిగినప్పుడు, వారు వీధుల్లోకి వచ్చి నిరసించారు. అది తప్పా? ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో వారితో చేరడం అనేది వేరే విషయం. పౌరసత్వ సవరణ చట్టం ఉద్య మం గురించి ఇలా చెప్పలేం. హిందువులు, ముస్లింల భయాన్ని గుర్తిం చడంలో వైఫల్యం చెందారు. ఈ వాస్తవం ముస్లింలకు వ్యతిరేకంగా ఉండాలా? భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టుల్లో, ఇతర ప్రాంతాల్లో పోరాడుతున్నది ముస్లిమేతరులే అనేది నిజం. లాయర్లు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు లాంటి వారు ఈ సమూహాల్లో ముస్లిమేతరులని మనకు తెలుసు. ముస్లింలు ఒంట రిగా ఉంటే, వారికి వ్యతిరేకంగా జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా, లేదా వారి హక్కుల కోసం వారు మాట్లాడకూడదని, దీని నుండి నిర్ధారణ చేయకూడదు. ఇతరులు కూడా వారితో కలిసి, వారి పౌర బాధ్యతను నెరవేర్చితే మంచిదే. తమ హక్కుల కోసం పోరాడుతున్న వారికి పౌరులుగా సంఘీభావాన్ని వ్యక్తం చేయడం మన కనీస కర్తవ్యం. అయితే ముస్లింల ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన రాజకీయపార్టీలు కూడా వారితో కలిసి కనిపించేందుకు అయిష్టంగా ఉంటే, సాధారణ హిందు వుల నుండి మనం ఇంకేమి ఆశిస్తాం? లౌకిక రాజకీయ పార్టీలు ‘ముస్లిం’ అనే పదాన్ని కూడా ఉచ్చరించ లేవు. ముస్లింలు ఏమి చేస్తారని ఆశించాలి?
దళితులకు, మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ముస్లింలు అంతే తీవ్రంగా మాట్లాడినప్పుడు, అప్పుడే వారి సొంత నిరసన కూడా చట్టబద్ధమైనదని చెప్పడం కూడా సరైనది కాదు. రైతులు ప్రతీసారి కార్మికుల హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తారా? కార్మికులు రైతుల కోసం నిరసన వ్యక్తం చేస్తారా? అప్పుడు తమ కోసం నిరసన వ్యక్తం చేసే హక్కును తాము కోల్పోవాలా? ప్రజా స్వామ్యంలో మనం ఇతరుల బాధను అర్థం చేసుకోవాలని ఆశిస్తారు. అది పౌరసభ్యత. కానీ ఒకవేళ నీకే అన్యాయం జరుగుతుంటే, నీకు అండగా నిలిచే వారి కోసం ఎదురుచూస్తూ, నీవు మౌనంగా ఉన్నావు, అంటే అప్పుడు నీవు నీపౌర కర్తవ్యాన్ని త్యజిస్తున్నావు. ఒకవేళ ముస్లింలు వారి కోసం మాట్లాడుతూ ఉంటే, అప్పుడు వారు సమాజంలో ఈ పౌర సభ్యతను చైతన్యవంతంగా నిర్వర్తిస్తున్నారు. వారితో చేరడం ద్వారా మనం మన పౌరసత్వాన్ని రుజువు చేసుకుందాం.
(”ది వైర్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
ప్రొ.అపూర్వానంద్