– విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు రాజీనామాను ఆమోదించొద్దని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమావేశానికి విద్యుత్ శాఖ తాజా సమాచారంతో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం లేని సమయంలో సీఎమ్‌డీ ప్రభాకరరావు చేసిన రాజీనామాను ఎలా ఆమోదిస్తారని అడిగారు. ఆయన రాజీనామాను ఆమోదించొద్దనీ, శుక్రవారం విద్యుత్‌శాఖపై జరిగే సమీక్షా సమావేశానికి ఆయన్ని పిలిపించాలని ఆదేశించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర ఏమైనా జరిగిందా? అని సీఎం ఆరా తీసారు. మొత్తం విద్యుత్‌శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
రెవెన్యూ గ్రామంగా జయశంకర్ స్వగ్రామం, జీవో జారీ చేసిన ప్రభుత్వం
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ప్రిలిమినరి నోటిఫికేషన్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీ.ఓ. నెంబర్ 405 తేదీ. 7.12.2023ను విడుదల చేశారు. ప్రస్తుతంఅక్కంపేట గ్రామం పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉంది. దీంతో పాటు, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్న అమరవీరుల స్తూపం వద్దగల స్మతి వనం సుందరీకరణ, అభివద్ధికి ఒక ఎకరం భూమి కేటాయింపునకు సంబంధించిన జీఓను జారీ చేశారు. ఇందుకనుగునంగా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.