రీ పోలింగ్‌కు అస్కారం ఇవ్వొద్దు

– ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ భారతి హౌలీకేరి
– ఎన్నికల నిర్వాహణ అధికారులకు ట్రైనింగ్‌
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రీ పోలింగ్‌కు ఆస్కారం లేకుండా పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ భారతి హౌలీకేరి సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి మాస్టర్‌ ట్రేనర్లకు, జిల్లాస్థాయి మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈవీఎంలు, వివిప్లాట్లు, కంట్రోల్‌ యూనిట్లపై అందరూ అవగాహన కలిగే ఉండాలని సూచించారు. ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని, శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల అధికారులు పూర్తి బాధ్యతతో ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా చేపట్టాలని, ఎన్నికల సిబ్బందికి రిటర్నింగ్‌ అధికారుల ద్వారా పోలింగ్‌ మెటీరియల్‌ను అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్‌రావు, మాస్టర్‌ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.