కారును పోలిన గుర్తులను కేటాయించొద్దు

– కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) విజ్ఞప్తి చేశారు. కారుకు దగ్గరిగా ఉన్న సింబల్స్‌తో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజా తీర్పుకు వ్యతిరేకమైందని వివరించారు. బుధవారం నాడిక్కడ నిర్వచన్‌ సదన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ సోమ భారత్‌, ఎంపీలు వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డిలు కేంద్ర ఎన్నికల అధికారులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు పొందని ఒక పార్టీకి కేటాయించిన రోడ్‌ రోలర్‌ సింబల్‌ను రద్దు చేయాలని, అలాగే కారుకు దగ్గరగా ఉన్న కెమెరా, రోటి మేకర్‌, టెలివిజన్‌ గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని వేరు వేరుగా రెండు అప్లికేషన్లను అధికారులకు సమర్పించారు. అనంతరం సోమ భారతి, ఎంపీలు వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కారును పోలిన గుర్తులతో ఓటర్లను పక్కదారి పట్టించేలా కొన్ని ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. వద్ధులు, మరికొందరు కారు గుర్తని భావించి, రోడ్‌ రోలర్‌ కు ఓటు వేస్తున్నారన్నారు. దీని కారణంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పలు చోట్ల ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. రోడ్‌ రోలర్‌ గుర్తును గుర్తింపు పొందని పార్టీకి మళ్లీ కేటాయించడం ఎలక్షన్‌ సింబల్స్‌ అలాట్మెంట్‌ అండ్‌ రిజర్వేషన్‌ ఆర్డర్‌ -1968 లోని కాంటరరీ టూ ది 10 బి కి విరుద్దం అన్నారు. అందులో 2011 లో రోడ్‌ రోలర్‌ సింబల్‌ ని కేంద్ర ఎన్నికల తొలగించిందన్నారు. మళ్లీ ఈ సింబల్‌ ని ఒక పార్టీకి ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే ఆ సింబల్‌ ను ఆ పార్టీకి రద్దు చేయడంతో పాటు, మరెవరికీ ఈ సింబర్‌ కేటాయించవద్దని కోరామ న్నారు. రోటి మేకర్‌, టెలివిజన్‌, కెమెరా… కారుకు చాలా దగ్గరి పోలికలతో ఉన్నాయన్నారు. వీటి ద్వారా గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి జరిగిన నష్టాన్ని ఓటింగ్‌ శాతంతో సహా సమర్పించినట్లు తెలిపారు. తమ అభ్యర్థనలపై ఎన్నికల సంఘం అధికారులు క్షుణ్ణంగా తెలుసుకున్నారని, వీటిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.