ఇంటర్‌ పరీక్షలకు ఉపాధ్యాయులకు విధులు వేయొద్దు

For inter exams Do not assign duties to teachers– ఆ ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలి
– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు విధులను వేయొద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు విధులను కేటాయిస్తూ ఉత్తర్వులను ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ, వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విధానం వల్ల దాదాపు సగం మంది ఉపాధ్యాయులు వచ్చేనెల మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధనకు దూరమవుతారని తెలిపారు. విద్యాసంవత్సరం చివరిలో చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పాఠాలను పునశ్చరణ చేసి ఏప్రిల్‌లో నిర్వహించే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాల్సి ఉంటుందని సూచించారు. కానీ ఆ ఉపాధ్యాయులను ఇంటర్‌ పరీక్షల కోసం ఇన్విజిలేషన్‌ విధులు వేయటం వల్ల ఆ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వచ్చే విద్యాసంవత్సరంపైనా పడుతుందని తెలిపారు. ఇంటర్‌ విద్యలో దాదాపు 25 శాతం విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. 75 శాతం మంది ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్య దామాషాలోనే 25 శాతం ఇన్విజిలేటర్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నుంచి, 75 శాతం ఇన్విజిలేటర్లను ప్రయివేటు జూనియర్‌ కాలేజీల నుంచి తీసుకుని పరీక్షలను నిర్వహించాలని సూచించారు. చదువు చెప్పిన వారే పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా పనిచేయాలని కోరారు. సబ్జెక్టు మార్పుతో విధులు వేయాలని తెలిపారు. ఈ విషయంపై గతనెల 18న పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు లేఖ రాశానని గుర్తు చేశారు. అయినా కమిషనర్‌ ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు వేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ, మండల పరిషత్‌, గిరిజన సంక్షేమ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల మనుగడకు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటర్‌ పరీక్షల ఇన్విజిలేషన్‌ విధులకు అనుమతించొద్దని డిమాండ్‌ చేశారు. కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.