ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలి

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  ఆళ్ళపల్లి మండలంలోని ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా, భయ భ్రాంతులకు గురి కాకుండా ఎన్నికల కేంద్రాలకు వచ్చి స్వచ్చందంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ పోలీస్ శాఖ తరుపున ప్రజలకు మనో ధైర్యం కల్పించారు. ఈ మేరకు మంగళవారం ఎస్సై ఆధ్వర్యంలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా వచ్చిన సీఆర్ పీయఫ్ బలగాలతో ముందుగా మండలంలోని రాయిపాడు గ్రామం నుంచి అనంతోగు గ్రామం వరకు అలాగే ఆళ్ళపల్లి నుంచి పెద్ద వెంకటాపురం గ్రామం వరకు, సాయంత్రం మండల కేంద్రం నుంచి మర్కోడు గ్రామం వరకు “పోలీస్ రూట్ మార్చ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాయకుల కోసం వివిధ పార్టీల కార్యకర్తలు ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నామన్నారు. జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఓటర్లు భయపడొద్దని, అటువంటి వారి సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని కోరారు. పోలీంగ్ జరిగే రోజు పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో ఉండే ఇండ్లలో బంధువులను, కొత్త వ్యక్తులను ఉంచుకోవద్దని, కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్  కె.ఉపేందర్, టీఎస్ఎస్ పీ సిబ్బంది పాల్గొన్నారు.