మాయమాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మొద్దు

– పలు గ్రామాల్లో చెఱకు శ్రీనివాస్ రెడ్డి ప్రచారం 
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
ఎన్నికల ముందు అసత్య ప్రచారాలు చేసి ఓట్లు దండుకునే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మి దుబ్బాక ప్రజలు మరోసారి మోసపోవద్దని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పోతారం, గంభీర్ పూర్, ఆరేపల్లే, చికోడ్ గ్రామాల్లో బుధవారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.2 సార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఉప ఎన్నికల్లో కల్ల బొల్లి హామీలు చెప్పి ఎమ్మెల్యే గా గెలిచిన రఘునందన్ రావ్ ఈ దుబ్బాక నియోజకవర్గానికి చేసింది ఏం లేదన్నారు.దుబ్బాకను సిద్దిపేటకు తాకట్టు పెట్టే నాయకులు కావాలా.. లేక దుబ్బాకను అభివృద్ధి చేసే నాయకులు కావాలో ఓటర్లు ఆలోచించుకొని ఓటు వేయాలని సూచించారు. దుబ్బాకలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి  హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక కు ఏలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.  పొద్దున లేస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప ఏనాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్  నాయకులు,క ార్యకర్తలు ఉన్నారు.