కరెంటు కోతల్లేవ్‌…

– బీఆర్‌ఎస్‌ది దుష్ప్రచారమే
– ఆపార్టీని ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు
– గతేడాదికంటే ఎక్కువ కరెంటు సరఫరా చేస్తున్నాం :విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు అమల్లో లేవని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ఏడాదికంటే పీక్‌ డిమాండ్‌ పెరిగినా ఎక్కడా రాజీ పడకుండా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరెంటు కోతలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఆపార్టీని ప్రజలు తిరస్కరించినా వారికి ఇంకా బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌లోనూ నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 226 స్పెషల్‌ ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామనీ, ఎక్కడ ఎలాంటి చిన్న అవాంతరం ఏర్పడిన క్షణాల్లో వాటిని పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ వస్తే కరెంటు పోతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తే, ప్రజలు దాన్ని తిప్పికొట్టారనీ, లేని కోతల్ని సృష్టించేందుకు ఆపార్టీ విశ్వప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నాటకాలకు తెరలేపడం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో గత ఏడాది విద్యుత్‌ సరఫరాతో పోలుస్తూ ఆయన శుక్రవారంనాడొక వివరణాత్మక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2022 డిసెంబర్‌ నుంచి 2023 ఏప్రిల్‌ వరకు మొత్తం 36,207 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2023 డిసెంబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 38,155 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశామని వివరించారు. గతంలో ఎన్నడూ లేనట్టు ఒకే రోజున గరిష్టంగా 15,497 మెగావాట్ల పీక్‌ డిమాండ్‌ విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో విద్యుత్‌ డిమాండ్‌ సహజంగానే పెరిగిందనీ, లోడ్‌ పెరిగితే లైన్లు ట్రిప్‌ అయ్యి, సాంకేతిక అవాంతరాలు తలెత్తుతాయనీ, వాటిని ఎప్పటికప్పుడు విద్యుత్‌ శాఖ సిబ్బంది సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నారని చెప్పారు.
ఇవిగో ఆధారాలు…
”గత ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి 30వ తేదీ వరకు వారం రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 1,369 సార్లు 11 కేవీ లైన్‌ ట్రిప్పింగ్‌ అయ్యాయి. ఆ వారం రోజుల్లో 580 గంట లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఈ ఏడాది అదే ఏప్రిల్‌ నెలలో గడిచిన వారంలో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్‌ సరఫరా ట్రిప్‌ అయ్యింది. 89 గంటలు మాత్రమే అంతరాయం వాటిల్లింది” అని విద్యుత్‌ శాఖ మంత్రి వివరించారు. ”గత ఏడాది అదే వారంలో 301 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల య్యాయి. ఇప్పుడు కేవలం 193 ట్రాన్స్‌ ఫార్మర్లు మాత్రమే ఫెయిలయ్యాయి. వాటిని కూడా వెంటనే మార్చి కొత్తవి బిగించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధ రిం చాం” అని స్పష్టంచేశారు. కరెంటు సరఫరాపై హైదరాబాద్‌లో ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నా రు. ఈ సెంటర్‌ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు.