బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొద్దు

-రైతులకు సాగు నీరందించాలి
-ఎన్నికల హామీ మేరకు రైతు బంధు, రుణమాఫీ వెంటనే అందజేయాలి
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – వీణవంక
ఎన్నికల హామీ మేరకు రైతులందరికీ రైతు బంధు, రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కష్టాలను తీర్చలేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని,  మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని హితువు పలికారు.కాల్వల ప్రాజెక్టు మత్తడి కూలిపోవడం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో రైతన్నలకు తీవ్ర కష్టాలు వచ్చాయని వాపోయారు. గత 20 ఏండ్లుగా ఈ ప్రాంతంలోని వాగుల్లో ఎక్కడ కూడా పర్రెలు తోడుకోలేదని, కానీ ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నల కష్టం తీర్చేందుకు సాగునీటిని అందజేయాలని డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రైతాంగంతో కలిసి స్వయంగా నీరు ఆపుకునేందుకు ప్రయత్నం చేశారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే రైతులకు ఎన్నికల హామీ మేరకు అందిస్తానన్న రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ సక్రమంగా అందజేయలేదని, వెంటనే ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత బంధు అందజేయాలి: దళితులను ఆర్థికంగా ఎదిగేలా చేసుందుకు గత రెండు సంవత్సరాల క్రితం మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రవేశపెట్టి వారి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేసిందని, కానీ ఆ అకౌంట్లను ప్రస్తుత ప్రభుత్వం ప్రీజ్ చేసిందని ఆరోపించారు. గతంలో సుమారు 18 వేల కుటుంబాలకు ఈ పథకం ద్వారా దళితులను ఆదుకుందని, ఇంకా సుమారు 1500 కుటుంబాల వరకు నిధులు విడుదల చేయాల్సి ఉందని, వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయనున్నామని, మరో నెల రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ పనిపై శుక్రవారం పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, సర్పంచ్ నీల కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ ఆనందం రాజమల్లయ్య, మాజీ ఎంపీటీసీ గెల్లు మల్లయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ గౌడ్, నాయకులు గొడుగు రాజు, రెడ్డిరాజుల రవి, కర్ర కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.