ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కల్గించొద్దు

– జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
నవతెలంగాణ – మెదక్‌
ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అధ్యక్షతన మెదక్‌ జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల అట్రాసిటీ చట్టంకు సంబంధించిన విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, యాదవరెడ్డిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలను ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు అయిన దళితుల పట్ల పొలీస్‌ అధికారులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా అధికారుల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసులలో బాధితులకు అందాల్సిన ఆర్థిక పరిహారం సకాలంలో అందించి వారికి సాంత్వన కలిగించేలా చూడాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ లకు ఇతర సాధారణ కేసులలో వెళ్తున్న ప్రజల పట్ల సైతం పోలీస్‌ అధికారులు సున్నితంగా, సామరస్యంగా మెదిలేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని, ఎమ్మెల్సీ కోరారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అందరూ ఒకటే అని, ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలో కలసి మెలసి జీవించాలని తెలిపారు. సమావేశం అనంతరం వారి వెంట వచ్చిన పలువురు సర్పంచుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ను ఎమ్మెల్సీ శేరి కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బాల స్వామి, అదనపు కలెక్టర్లు రమేష్‌, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, విజిలెన్స్‌ కమిటీ సభ్యులు, తదితర అధికారులు ఉన్నారు.