
నవతెలంగాణ – గోవిందరావుపేట
మద్యం సేవించి వాహనదారులు తమ వాహనాలను నడిపే ప్రమాదాల బారిన పడకూడదని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా వాహన యజమానులు డ్రైవర్లు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్సై మస్తాన్ మాట్లాడుతూ వాహన డ్రైవర్లు ప్రజలు రహదారి ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు.ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అని , మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు.ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.