గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించొద్దు

– విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజుల దోపిడీ
– ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్ష,కార్యదర్శులు అరుణ్‌కుమార్‌, ఎర్రవల్లి శ్రీనివాస్‌
– అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నందు సుకేశినికి వినతిపత్రం
నవతెలంగాణ-చేవెళ్ల
ఫైర్‌ సేఫ్టీ లేని, గుర్తింపు లేని పాఠశాలల్లో తల్లి దండ్రులు తమ పిల్లలను చేర్పించరాదనీ ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌ కుమార్‌, ఎర్రవల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఫైర్‌ సేఫ్టీ లేని పాఠశాలలకు గుర్తింపు ఇవ్వకూడదని డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నందు సుకేశినికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్‌లో చాలా పాఠశాలల భవనాలకు ఫైర్‌ సేఫ్టీ లేదన్నారు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తి పడి పర్మిషన్లు ఇస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ లేని పాఠశాలల భవనాలకు, గుర్తింపు ఇవ్వొద్దని విద్యాశాఖ అధికారులకు తెలియజేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూల్లు చేస్తున్నా, విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. పాఠ శాల ప్రారంభమైన జూన్‌ నెలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలను సమగ్ర సర్వే చేస్తామని తెలిపారు. మండల ఎంఈఓలు ప్రయివేట్‌ పాఠశాలలను తనిఖీ చేయా లని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో నిర్వహి స్తున్నారా లేదా తెలుసుకోవాలని కోరారు.