
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీఎం రమణా చారి, పెద్దవంగర నోడల్ హెచ్ఎం బుధారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ‘తెలంగాణ ఓటర్ సంకల్ప పత్రాన్ని’ ఆవిష్కరించారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, అవగాహన సదస్సు లతో పాటుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఓటు వేయించడానికి ‘తల్లిదండ్రుల సంకల్ప పత్రం’ పేరిట కరపత్రాలను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. వాటిపై తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని తిరిగి జిల్లా విద్యాధికారికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ చేతుల్లో ఉన్న వజ్రాయుధమైన ఓటును ఎలాంటి పలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, అంజయ్య, యాకయ్య, శ్రీధర్, షౌకత్ అలీ, విజయ్ కుమార్, శ్రీనివాస్, వెంకన్న, సువర్ణ, హైమ, కరుణ తదితరులు పాల్గొన్నారు.