నవతెలంగాణ – నవీపేట్
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని ఈ ఎన్నికల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని కాబట్టి ఓటుకు నోటు ఇవ్వొద్దని తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలలో కమిషన్లు తీసుకోవద్దని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఇంటి దీపం మాక్స్ ఆధ్వర్యంలో హెచ్ పీ పెట్రోల్ బంకును ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు బాగుపడతాయని అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి దీపం మాక్స్ లాంటి మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులతో పాటు స్ప్రే చేసేందుకు డ్రోన్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తుండడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అలాగే మహిళా సంఘం ఆధ్వర్యంలో కూరగాయల సాగు చేస్తే తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. బీరకాయ, కాకరకాయ లాంటి పంటలు పండిస్తే ఎకరానికి లక్ష రూపాయలకు పైగా లాభం వస్తుందని అన్నారు. వచ్చే సీజన్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సైతం ఇంటి దీపం మాక్స్ మహిళా సంఘానికి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు జరిపిన సర్వేల్లో పాలల్లో కల్తీ కారణంగా 80 శాతం ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి సర్కారు పాలు అయినటువంటి విజయ డైరీ పాల పదార్థాలను వినియోగించుకోవాలని కోరారు. కేసీఆర్ దౌర్జన్యానికి భావితరాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంక్షేమంతో పాటు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లను చేయడం జరిగిందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడం కోసమే తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. రైతులు సహకరిస్తే షుగర్ ఫ్యాక్టరీని స్థాపిస్తామని అన్నారు. అనంతరం జన్నెపల్లి మాటు కాలువను పరిశీలించి సాగునీటి విషయమై రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ చందర్, నిజామాబాద్ ఆర్డిఓ, ఏసిపి, మ్యాక్స్ సీఈవో జేబన్నా, జిల్లా అధ్యక్షురాలు చిన్న గంగు, మండల అధ్యక్షురాలు బేగరి లక్ష్మి, ఓఎమ్ నిర్మల, మేనేజర్ శోభ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.