ఇంటర్‌ పరీక్ష ఫీజులు పెంచొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇంటర్‌ పరీక్ష ఫీజులను వంద శాతం పెంచాలనే ఇంటర్‌బోర్డు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతమున్న రూ. 500 ఉన్న ఫీజును 1500 వరకు పెంచాలని ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఈ పరీక్షలు రాస్తున్న 9 లక్షల మంది విద్యార్థులకు ఇది భారంగా మారుతుందని తెలిపారు. ఫీజును పెంచకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఇంటర్‌ విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.