– ఎల్‌డీఎఫ్ అభ్యర్ధి ఇజాక్ కేసులో ఈడీకి కేరళ హైకోర్టు ఆదేశాలు
తిరువనంతపురం : పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎల్‌డీఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇజాక్‌ను ఫెమా ఉల్లంఘనల కేసులో ప్రశ్నించేందుకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు పిలవవద్దని కేరళ హైకోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోరింది. కెఐఐఎఫ్‌బి జారీ చేసిన మసాలా బాండ్ విషయంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు ఆయనపై నమోదైంది. ఇజాక్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా జస్టిస్ టి.ఆర్.రవి మాట్లాడుతూ, పిటిషనర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, ఇవి ముగిసేవరకు ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీ చేసి సమస్యలు సృష్టించవద్దని చెప్పారు. ఇడి అందచేసిన ఫైళ్ళను కోర్టు పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి రవి ఈ వ్యాఖ్యలు చేశారు. మసాలా బాండ్ ద్వారా అందిన నిధుల లావాదేవీల్లో కొన్నింటికి ఇజాక్ వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని కోర్టు పేర్కొంది. అయితే ఈ దశలో ఆ లావాదేవీల ఆదేశాలు వెల్లడించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వివరాలను దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తికి అందచేయాల్సి వుంటుందని పేర్కొంది. ఈ లావాదేవీలపై దర్యాప్తు నిర్వహించాలంటే ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఈడీ ద్వారా వివరణ పొందాల్సిన తీరు తర్వాత దశలో పరిగణించబడుతుందని పేర్కొంది. ఇజాక్‌కు ఎప్పుడు వీలుంటే ఆ తేదీల్లోనే తమ ముందు హాజరు కావాల్సిందిగా కోరామని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటువంటి ఆదేశాలను కోర్టు జారీ చేసినట్లైతే ఈడీ ముందుకు హాజరు కానక్కరలేదన్న తన వాదనను వదులుకోవాల్సిందిగా కోర్టు ఆయనపై ఒత్తిడి తెస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మే 22న తదుపరి విచారణకు కోర్టు వాయిదా వేసింది.
కెఐఐఎఫ్‌బి వైస్ ఛైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా తన పదవీ కాలంలో మసాలా బాండ్ ద్వారా అందిన నిధుల వినియోగంపై మౌఖిక సాక్ష్యమివ్వడానికి ఇడి ముందుకు హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు జారీ చేశారని ఇజాక్ పేర్కొన్నారు. కానీ తాజా సమన్ల వెనుక గల ఏకైక ఉద్దేశం తన ఎన్నికల ప్రచారానికి అడ్డం కొట్టడమేనని అన్నారు.