నర్సరీ, కిండర్ గార్డెన్ టీచర్లయితే పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే వుండాలి. మీరు అత్యవసరంగా ఎక్కడికయినా వెళ్లాల్సి వస్తే, మీ పక్క టీచర్ను గమనించాల్సిందిగా కోరాలి. లేదా యాజమాన్యానికి తెలియచేయాలి.
ఒకసారి క్లాసులోకి వచ్చిన తరువాత పిల్లల బాధ్యత పూర్తిగా మీదే! మీరు లేని సమయంలో పిల్లలు ఒకరినొకరు కొట్టుకోవడమో, కుర్చీలోంచి కింద పడిపోవడమో జరుగుతుంది. అది వారి శారీరక భద్రతకు ముప్పు తెస్తుంది. పిల్లలను స్కూల్లో చేర్పించినపుడు వారి భద్రత విషయంలో ఎంత ఆందోళన చెంది ఉంటారో ఊహించండి. అలాగే మీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంతే ఆందోళనకు గురై వుంటారన్న సంగతిని అర్థం చేసుకోండి.
పిల్లల ఒంటిమీద గాయాలు :
పిల్లల ఒంటిమీద కనిపించే గాయలను గమనిస్తూ ఉండండి. ఆ గాయానికి కారణం తెలుసుకోండి. ఇతరులు చెప్పే మాటల మీద ఆధారపడకండి. అనుమానం ఉన్న పిల్లల మీద నేరం నెట్టేసి పనయిపోయిందనుకోవద్దు. మీకు తెలియకుండా పిల్లల మీద అక్కసు చూపించే వ్యక్తులను నిఘావేసి పట్టుకోండి. ఆ వయసులో పిల్లలు తమపై దాడి చేసే పెద్దలను పట్టివ్వలేరు. పాఠశాలలో పిల్లలు గడిపే సమయమంతా మీ పర్యవేక్షణలోనే ఉండాలి. ఏ చిన్న తప్పు దొర్లినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉదాసీనంగా ఉంటే పిల్లలకు ఏమయినా జరిగినపుడు, తేలికగా మీ కింది ఉద్యోగుల మీద తప్పునెట్టి తప్పించుకోలేరు. సిస్టమ్ సరిగ్గా లేదని వాదించినా అది సరైన జవాబు కాదు. పిల్లల భద్రత మీకు ఎంత అవసరమో, వ్యవస్థలోని సమస్యలు, లోపాలు తెలుసుకుని, యాజమాన్యానికి తెలియజేయడం కూడా మీ బాధ్యతే అవుతుంది.
స్పష్టంగా చెప్పండి… చెప్పింది చేయండి:
పిల్లలకి ఏం చెప్పినా అది వారికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. అలాగే మీరు ఏం చెబుతారో అది చేస్తారనే భావన వారికి కలిగించాలి. ఉదాహరణకు మీరు బయటకు తీసుకెళతానని వారికి వాగ్దానం చేస్తే, కచ్చితంగా బయటకు తీసుకు వెళ్లండి. మీరు వాగ్దానం చేసి వారి చేత చదివించాల్సింది చదివించేసిన తరువాత, పనయిపోయింది కదా అని నిర్లక్ష్యం చేస్తే మీ మాట తప్పే నైజాన్ని వారు గ్రహిస్తారు. అలాగే వారు చెప్పే కథలు వినాలనుకుంటున్నానని చెబితే, అదే రోజు ఏదో సమయంలో తీరిక చేసుకుని వారు చెప్పే కథను వినండి.. మీరు చెప్పినట్టుగానే చేసినందుకు వారికి మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి మీరు వారితో చేయబోయే విద్యా కార్యక్రమాలను సఫలం చేస్తుంది.
చిన్న వయసులో ఉన్నపుడు మీ పెద్దవాళ్లు మీ విషయంలో చేసిన వాగ్దానాలను, వాటిని సరిగ్గా నిలబెట్టుకోలేక పోయిన సందర్భాలను గుర్తు చేసుకోండి. ఆ సమయంలో మీకు వారిపై ఏర్పడిన ద్వేష భావం, విముఖత, అవిశ్వాసనీయత క్రమంగా పెరిగి పెద్దదయి, వారి చుట్టూ మీరు ఏర్పరుచుకునే శాశ్వతాభిప్రాయంగా మారే అవకాశం ఉంది. తత్ఫలితంగా వారి పట్ల గౌరవభావంతో వుండలేరు.
అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
సాధారణంగా ప్రాథమిక పాఠశాల పిల్లలు తరుచుగా అనారోగ్యానికే గురవుతుంటారు. ఈ పరిస్థితిని ఊహించి ప్రతి స్కూల్లోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ని సిద్ధంగా ఉంచుతారు. స్కూల్లో పిల్లలకు అనుకోని దెబ్బలు తగలడం, జ్వరం, వాంతులు, విరోచనాలు, యూరిన్ ఆపుకోలేకపోవడం… లాంటి సర్వసాధారణ సమస్యలు వచ్చినప్పుడు స్కూల్ యాజమాన్యం, ఆయాలు, టీచర్లు సరిగ్గా స్పందించకపోతే తల్లిదండ్రులు చాలా బాధ పడతారు. దానితోపాటు మిగతా పిల్లలు ఆందోళన పడతారు. తమకు ఏదయినా అయితే ఇంట్లో వాళ్లు చూపించే శ్రద్ధాసక్తులకు అలవాటు పడిన పిల్లలు, ఈ పరిస్థితిని అంత త్వరగా జీర్ణించుకోలేరు. ముఖ్యంగా నర్సరీ, కిండర్ గార్డెన్ పిల్లలు మరింత అవేదనకు లోనవుతారు. ఇంటికి, స్కూల్‌కి గల తేడాను స్పష్టంగా తెలియజేస్తుంది ఈ పరిస్థితి. కాబట్టి పిల్లలకు అనారోగ్యంగా ఉన్నపుడు వారిని చేరదీసేతత్వాన్ని ఎక్కువగా ప్రదర్శించాలి. పాఠాలు చెప్పే పనికి విఘాతం కలుగుతుందన్న తొందరలో, ఎవరినో ఒకరిని పిలిచి, పిల్లల్ని వారికప్పగించి, చేతులు దులిపేసుకోకూడదు. చిరాకు పడిపోకుండా, పిల్లల్ని చేరదీయాలి. సమస్య పెద్దదయితే వారి తల్లిదండ్రులు వచ్చే వరకు వారిని అంటిపెట్టుకుని ఉండాలి. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యాన్ని అందివ్వడానికి అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్