
నవతెలంగాణ – రాయపోల్
బిసి (డి) లో ఉన్న ముదిరాజ్ కులాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు బిసి(ఏ) లో కలుపుతామని ప్రకటనలు చేస్తున్నారని ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బీసీ(ఏ) కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు అన్నారు. శుక్రవారం బిసి(డి) ముదిరాజ్ కులాన్ని బీసీ(ఏ) లో కలపొద్దని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ(డీ)లో కులవృత్తులు, సంచార జాతులు, భిక్షాటన చేసుకునీ జీవించే 57 కులాలు ఉన్నాయని, 1970 సంవత్సరంలో 7 శాతం రిజర్వేషన్ కల్పించారు. అనంతరం 13 గుర్తింపులేని కులాలను బీసీ(ఏ)లో కలిపినప్పటికీ రిజర్వేషన్ మాత్రం అదే 7 శాతం అమలు చేస్తున్నారు. బీసీ(ఏ) లో ఉన్న కులాల పరిస్థితి చాలా దయానియంగా ఉందని ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబాటుకు గురవుతున్నారు.1968 సంవత్సరంలో అనంతరామన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా వెనుకబడిన కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేసి అట్టి కులాలను బీసీ(ఏ) జాబితాలో పొందుపరిచారు. కాబట్టి బీసీ(ఏ) కుల జాబితాలో ముదిరాజులను చేరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రాములు, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు యాద సురేందర్, గంగిరెద్దుల సంఘం జిల్లా అధ్యక్షులు కనకయ్య, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు మైసయ్య, వీరభద్ర సంఘం జిల్లా అధ్యక్షులు ఆగుళ్ల శంకర్, తెలంగాణ రజక సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.