అటవీ బిల్లును ఆమోదించొద్దు

– దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
– దేశానికి మరణ శాసనం అవుతుంది
– కార్పొరేట్‌ దోపిడీకి బాట వేస్తుంది
– పర్యావరణవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అడవుల సంరక్షణపై సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానిని ఆమోదించవద్దని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలోనూ, 16 రాష్ట్రాలలోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజలు, వాతావరణ పరిరక్షణ బృందాల సభ్యులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలకు హాజరయ్యారు. నిరసనకారులు ‘భారత అడవులను కాపాడండి’ అనే నినాదంతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రచారం చేపట్టారు. బిల్లును ఆమోదించవద్దని రాజకీయ నాయకులు, పార్లమెంట్‌ సభ్యులను కోరుతూ ఇ-మెయిల్‌ సందేశాలు కూడా పంపారు. ఈ కార్యక్రమాలకు తోడుగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలలో ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఛత్తీస్‌ఘర్‌లోని హాస్‌డియోతో పాటు కొల్‌కతా, విశాఖపట్నం నగరాలలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
‘అడవులు’ అనే పదం నిర్వచనాన్ని ఈ బిల్లు నీరుకారుస్తోందని, ఇది ఆమోదం పొందితే దేశానికి, ప్రజలకు మరణశాసనం అవుతుందని వన్యప్రాణుల బోర్డు మాజీ సభ్యుడు, యునైటెడ్‌ కన్జర్వేషన్‌ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ హూవర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణానికి సంబంధించిన బిల్లులలో ఇది అత్యంత విధ్వంసకరమైనదని వ్యాఖ్యానించారు. ‘జీవ వైవిధ్యాన్ని, అడవులను కాపాడతానని ప్రధాని మోడీ చెబుతుంటారు. అయితే ఆయన మనుషులు లోక్‌సభలో సవరణ బిల్లును ఆమోదించడం ద్వారా అడవులను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. అడవులుగా పరిగణించకపోయినప్పటికీ పర్వత శ్రేణి ప్రాంతాన్ని స్థానిక తెగల వారు కాపాడుకుంటూ వస్తున్నారని, ఈ బిల్లు ఆమోదం పొందితే అది కనుమరుగవుతుందని ఆరావళి బచావ్‌ సిటిజన్స్‌ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపక సభ్యుడు, ట్రస్టీ నీలం అహ్లువాలియా హెచ్చరించారు. ‘దేశంలోని 39,063 హెక్టార్ల పర్వత శ్రేణి ప్రాంతాన్ని స్థానిక తెగల వారు పరిరక్షించుకుంటున్నారు. ఈ భూములను అడవులుగా ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే పర్వత శ్రేణి ప్రాంతం మొత్తం అదృశ్యమవుతుంది’ అని ఆయన తెలిపారు.
న్యాయస్థానాలు అడవుల ప్రాధాన్యతను చాటిచెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వాటిని సంపన్నులకు దోచి పెడుతున్నాయని లెట్‌ ఇండియా బ్రీత్‌ సంస్థకు చెందిన యష్‌ మార్వా తెలిపారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే అటవీ సంపదను ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్మకానికి పెడతారని, దోపిడీ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ చట్టంలో ప్రతిపాదించిన సవరణలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోల్‌కతాలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న వారియర్‌ మామ్స్‌ ప్రతినిధి సమీక్షా ఆచార్య మాట్లాడుతూ ‘కొల్‌కతాలో అసాధారణ వడగాల్పులు వీస్తుంటాయి. వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సవరణ బిల్లుతో మా నగరంలోని పచ్చని ప్రాంతం మొత్తం మాయమవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులను మర అడవులు అడ్డుకుంటున్నాయి. ఈ బిల్లుతో వాటిని కూడా నాశనం చేస్తారు’ అని వాపోయారు.
గోవాలోని రయా గ్రామంలోని యువత తమ గ్రామ సమీపంలో ఉన్న అడవులను కాపాడండంటూ ప్రదర్శన నిర్వహించారు. గోవాలోని చాలా గ్రామాలలో చెట్టూ చేమలు, పొదలు వాలుగా ఉండి వరద నీటి ప్రవాహాలను అడ్డుకుంటాయి. అయితే వీటిని ప్రభుత్వాలు అడవులుగా గుర్తించడం లేదు. బిల్లు ఆమోదం పొందితే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, నిర్మాణ కంపెనీలు వాటిపై కన్నేస్తాయని పర్యావరణవేత్త ఫరై దివాన్‌ పటేల్‌ చెప్పారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎస్టీలకు, సంప్రదాయకంగా అటవీ భూములలో సేద్యం చేసుకుంటున్న వారికి లభిస్తున్న రక్షణ ఇక దొరకదని నిపుణులు హెచ్చరించారు. ఎందుకంటే ఈ భూములు అటవీ సంరక్షణ చట్టం పరిధిలో లేవు.