కరెంట్‌ బిల్లులు కట్టొద్దు

Do not pay current bills– కాంగ్రెస్‌ హామీలను సద్వినియోగం చేసుకోవాలి
– నిరుద్యోగభృతి ఊసేదీ..? : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-సిరికొండ
కాంగ్రెస్‌ పార్టీ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని హామీనిచ్చిన నేపథ్యంలో వచ్చే జనవరి నెల నుంచి ప్రజలెవరూ కరెంట్‌ బిల్లు చెల్లించొద్దని, హామీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలోని ది లివింగ్‌ క్రైస్ట్‌ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూసిందని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో రూ.2వేలు పెన్షన్‌ తీసుకున్న 44 లక్షల మందికి ఎలాంటి అప్లికేషన్‌ తీసుకోకుండా, వచ్చే జనవరి నుంచి రూ.4వేలు ఇవ్వాలని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్‌ తీసుకోవడంతో ఎంతో మందికి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఆరు గ్యారంటీల అప్లికేషన్‌లో నిరుద్యోగ భృతి కాలమ్‌ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుబంధు అర్హులైన రైతులకు వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని కోరారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఊసే లేదని, వారికి వెంటనే రూ.4000 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు మాన్‌సింగ్‌, సుమనారెడ్డి, ఎంపీపీ సంగీత రాజేందర్‌, మాజీ జెడ్పీటీసీ అయిత సుజ ఫిలిప్‌, మాజీ ఎంపీపీ మంజుల, మండల అధ్యక్షులు శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.