– ‘ముత్యాలమ్మ’ ఘటనపై సీరియస్‌గా ఉన్నాం : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రాజకీయ నేతలు, ఆయా సంస్థల నాయకులెవ్వరూ దేవాలయాలపై రాజకీయం చేయొద్దని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. దేవుడు అందరికీ దేవుడేనని పునరుద్ఘాంటించారు. మంగళవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం మతసామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు నిలయం అని గుర్తుచేశారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే నిందితులను అరెస్టు చేశామనీ, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 14న 234/2024 కింద ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేసినట్టు వివరించారు. నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసానిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపించి సమగ్రంగా పరిశీలించినట్టు తెలిపారు. ఘటన తర్వాత నిర్మాణ సంబంధిత పనులు కూడా చేపట్టారని పేర్కొన్నారు. బుధవారం దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఈ ఘటనలో కొంతమంది అల్లరి మూకలు చేరి, మతసామరస్యతకు భంగం కలిగేలా చేస్తున్నాయనీ, కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సహేతుకం కాదని హితవు పలికారు. ఇటువంటి ఘటనల పట్ల దేవాదాయ శాఖ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉండి ప్రార్థనామందిరాలపై దాడులు జరగకుండా చూడాలనీ, హైదరాబాద్ నగర మత సామరస్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.