ఆ మసీదులో నమాజ్‌ చేయకూడదట!

– కలెక్టర్‌ అసాధారణ ఆదేశం
– అది వివాదాస్పద స్థలమని బుకాయింపు
– హైకోర్టును ఆశ్రయించిన మసీదు ట్రస్ట్‌, వక్ఫ్‌ బోర్డు

ముంబయి : అది ఉత్తర మహారాష్ట్రలోని 800 సంవత్సరాల నాటి పురాతన జుమ్మా మసీదు. జలగావ్‌ జిల్లాలోని ఎరండల్‌ తాలూకాకు చెందిన ముస్లిం మైనారిటీలు ప్రతి రోజూ ఆ మసీదుకు వచ్చి ఐదుసార్లు ప్రార్థనలు చేస్తారు. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం ఆగిపోయింది. మసీదులో ప్రార్థనలు చేయరాదంటూ జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలే దీనికి కారణం. కరడుకట్టిన మతోన్మాద హిందూ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కలెక్టర్‌ దొరవారు ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. మసీదు ప్రాంగణంలో ప్రార్థనలు చేయకుండా అక్కడ 144వ సెక్షన్‌ కూడా విధించి, పోలీసులను మోహరించారు. మసీదును స్వాధీనం చేసుకోవాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. ఈ మసీదు ‘వివాదం’లో ఉన్నదని సాకు చూపారు. కాగా కలెక్టర్‌ ఆదేశాలను జుమా మసీదు ట్రస్ట్‌ సభ్యుడు అస్లాం బాంబే హైకోర్ట్‌ ఔరంగాబాద్‌ బెంచ్‌లో సవాలు చేశారు. కలెక్టర్‌ ఇచ్చిన అసాధారణ ఆదేశాలు మతపరమైన విద్వేషాలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వివాదం ఎందుకు?
శతాబ్దాల కాలం నాటి మసీదు ఒక్కసారిగా వివాద స్థలం ఎందుకైంది? ఊరూ పేరూ లేని పాండవ్‌వాడ సంఘర్ష్‌ సమితి అనే మతోన్మాద సంస్థ ఇచ్చిన ఫిర్యాదే దీనికి కారణం. ఈ సంస్థకు చెందిన ప్రసాద్‌ మధుసూదన్‌ దండావతే అనే వ్యక్తి మేలో జలగావ్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ సంస్థలలో కూడా సభ్యుడే. హిందూ ప్రార్థనా స్థలాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆయన ఆరోపణ. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. జమా మసీదు ట్రస్ట్‌ చట్టవిరుద్ధంగా ఆ స్థలాన్ని ఆక్రమించిందని కూడా దండావతే ఆరోపించారు.

మసీదు ట్రస్ట్‌, వక్ఫ్‌ ఏమన్నాయి?
అయితే ఈ విషయాలేమీ తమకు తెలియవని మసీదు ట్రస్ట్‌ తెలిపింది. కలెక్టర్‌ కూడా విచారణ జరిపారని, అయితే తమ వాదనలు వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.