ఇల్లు.. జర్నలిస్టులకు చిరకాల స్వప్నం. జీవితంలో స్థిర పడ్డారని చెప్పుకోవడానికి సాధారణంగా అందరూ ఇంటినే గీటురాయిగా భావిస్తారు. పరస్పరం కలిసి కరచాలనం చేసే క్రమంలోనూ ‘ఇల్లు’ కట్టుకున్నావా? అని అడుగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ లోనూ జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటిస్థలం కలే అవుతున్నది. తెలంగాణ సాకారమై దాదాపు పదేండ్లు పూర్తవుతున్నది. కాగా తెలంగాణ జర్నలిస్టులు ఇండ్లు కట్టుకుని తమ జీవనయానాన్ని కొంతలో కొంతైన కుటుంబంతో కలిసి విలాసంగా కాకపో యినా, సంతోషంగా ఉండాలని ఓ చిన్ని ఆశ. తెలంగాణ ఉద్య మంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది. మరువలేనిది. ఎవరూ కాదనలేనిది. ప్రాణాలకు సైతం వెరవకుండా ప్రజల ఆకాంక్ష ను నిజం చేయడంలో పాత్రికేయుల సాహసం అంతా ఇంతా కాదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడి యా, జర్నలిస్టులను పట్ల ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. కానీ రాష్ట్రంలోని జర్నలిస్టులకు నివా సం నేతిబీర చందమవుతున్నది. దాదాపు 60 వేల మందికి ిపైగా జర్నలిస్టులు ఉంటే, వారిలో సగం మందికి కూడా అక్రిడిటేషన్ కార్డులు లేవు. వారి కుటుంబాలతో కలిసి లక్షన్న రకు పైగా జనాభా ఉంది. వారంతా ఇంటి అద్దెలు కట్టలేక తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఏండ్లతరబడి మోస్తున్నారు. ఇక చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి వర్ణ ణాతీతం. మహిళా జర్నలిస్టుల ఇబ్బందులు చెప్పనలవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. 1978, 1982, 1994లో దాదాపు 850 మందికి అప్పటి ప్రభుత్వాలు ఇచ్చాయి.
కాగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. వేలాదిమంది అర్హులైన జర్నలిస్టులు కండ్లు కాయలు కాసే లా ఎదురుచూడాల్సిన దుస్థితి నెల కొంది. హైదరాబాద్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈ దయనీయమైన వాతావరణం ఉంది. అయితే జిల్లాల్లో అక్కడక్కడా ఇప్పుడు ఇండ్ల స్థలాలిస్తు న్నారు. ఇందుకు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ధన్యవాదాలు. సుప్రీంకోర్టులో కేసు పేరుతో హైదా రాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా కాలయాపన చేస్తూ వచ్చింది. ఆరునెలల క్రితం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చని తీర్పునిచ్చింది. అయినప్పటికీ బీఆర్‌ఎస్ సర్కార్ మాత్రం చడీచప్పుడు చేయడం లేదు. అయినా, సర్కారు కనీసం తన విధానాన్ని ప్రకటించలేదు. జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం దీర్ఘకాలికంగా పని చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీబ్ల్యూ జేఎఫ్) ఏండ్ల తరబడి ఇండ్లస్థలాల కోసం పోరాటాలు చేస్తు న్నది. ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్న లిస్టుల ఇండ్లస్థలాల కోసం పలుమార్లు జర్నలిస్ట్ సంఘాలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ శివార్లలో స్థలాలు వెతికారు. మీడియా అకాడమీ ద్వారా అభిప్రాయ సేకరణ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక చట్టం ద్వారా స్థలాలు కేటాయిస్తామని చెప్పు కొచ్చారు. ఒక్కోసారి ఒక్కోలా తన హామీ అమలును వాయిదా వేస్తూనే వస్తున్నారు. అయినా అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అనేక జర్నలిస్టుల హౌసింగ్ సోసైటీ లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జవహార్‌లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ, గ్రేటర్ హైదరాబాద్ హౌసింగ్ సోసైటీ, దక్కన్ హౌసింగ్ సొసైటీ, తెలంగాణ జర్నలిస్ట్స్ హౌసింగ్ సోసైటీతో పాటు ఇంకా చాలానే ఉన్నాయి. వీటితో సభ్యత్వం ఉన్న వారు, లేని వారూ అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టు లతో పాటు హైదరాబాద్‌లోని పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు కచ్చితంగా ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, బీఆర్‌ఎస్ సర్కారు పూటకోమాట చెప్పి చివరకు ఎన్నికల కోడ్ వచ్చేదాకా పెండింగ్ లో పెట్టింది. సీఎం కేసీఆర్ రెండువారాలు అందుబాటులో లేరు. దీంతో ఎన్నికల ముందు చెప్పుకునే కూడా అవకాశం లేకుండా పోయింది.
చావుకబురు చల్లగా చెప్పినట్టు మంత్రి కేటీఆర్ ఇటీవల తనను కలిసిన విలేకర్లతో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలతో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తామంటూ మరోసారి చెప్పారు. ఆయన ఈ విషయమై పదే పదే మాట్లాడుతున్నా, ఆచరణలోకి రావడం లేదు. చివరకూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొ చ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడం బాధాకరం. కేసు పేరుతో ఏండ్ల తరబడి జాప్యం చేసిన ప్రభుత్వం, తీర్పు వచ్చాక మిన్నకుండిపోయింది. కాగా జర్న లిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఫెడరేషన్ దశలవారిగా ఆందో ళనా కార్యక్రమాలు చేపట్టింది. తొలిదశలో నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులతో సంతకాల సేకరణ చేపట్టింది. రెండో దశలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించింది. మూడో దశలో జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముందు రిలే దీక్షలు చేసింది. నాలుగో దశలో హైదరాబాద్‌లో గత మే 18న వందలాది మంది జర్నలిస్టులతో ‘మహాధర్నా’ నిర్వహించింది. ఇండ్లస్థలాలు వచ్చే వరకు ఫెడరేషన్ ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రకటించింది. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కూడా జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్లస్థలాల కోసం దాదాపు 35 ఏండ్లుగా ఎదురుచూడాల్సి రావడం ఆవేదనా భరితం. కనీసం సుప్రీంకోర్టు తీర్పునూ కేసీఆర్ సర్కారు గౌరవించదా? ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేదంటే ఉద్యమాలు, ఓటు ద్వారానే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు.
బి.బసవపున్నయ్య9490099108