ఇజ్రాయెల్‌కు భారత కార్మికులను పంపొద్దు

– యుద్ధ నేరాలకు పచ్చజెండా ఊపనట్టవుతుంది
–  బ్రిటీష్‌ ఎన్జీవో ఫెయిర్‌స్క్వేర్‌ అభ్యర్థన : ఇజ్రాయెల్‌ నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదన్న కేంద్రం
న్యూఢిల్లీ : బహిష్కరణకు గురైన పాలస్తీనా కార్మికుల స్థానంలో భారత పౌరులను ఇజ్రాయెల్‌కు పంపటంపై బ్రిటీష్‌ మానవ హక్కుల సంఘం ఫెయిర్‌స్క్వేర్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత పౌరులను అక్కడకు పంపితే యుద్ధ నేరాలకు పచ్చ జెండా ఊపినట్టేనని తెలిపింది. భారత పౌరులను ఇజ్రాయెల్‌కు పంపవద్దని భారత ప్రభుత్వాన్ని ఎన్జీవో కోరింది. ఇది భారత కార్మికులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని వివరించింది. ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై యుద్ధం చేయడంతో ఒక లక్ష మంది భారతీయ కార్మికులను ఆ దేశానికి తీసుకురావాలని భావిస్తున్నట్టు ఇజ్రాయెల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ నవంబర్‌ 1న ప్రకటించిందని ఫెయిర్‌స్క్వేర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత వారి పని అనుమతులు ఏకపక్షంగా రద్దు చేయబడ్డాయని ఫెయిర్‌స్క్వేర్‌ వివరించింది. కాగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ దేశం నుంచి కార్మికులను రిక్రూట్‌ చేయడానికి ఎటువంటి అభ్యర్థన చేయలేదనీ, అయితే అలాంటి ఒప్పందానికి ఎప్పటికీ తలుపులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది. ”ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా కాల్పుల విరమణను నిర్ధారించడానికి భారతదేశం తన ప్రయత్నాలను అంకితం చేయాలి” అని ఫెయిర్‌స్క్వేర్‌ డైరెక్టర్‌ నికోలస్‌ మెక్‌గీహాన్‌ అన్నారు.