తండ్రి హత్యపై మాట్లాడకూడదా..?

తండ్రి హత్యపై మాట్లాడకూడదా..?– వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు అవినాష్‌ రెడ్డికి సంబంధాలున్నాయి : డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై రాయితో దాడి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్సీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనపై తాను మాట్లాడకూడదా అని డాక్టర్‌ నర్రెడ్డి సునీతారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘జస్టిస్‌ ఫర్‌ వివేకా.. సూత్రధా రులెవరు?’ అనే అంశంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆమె వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన ఏ-1 ఎర్ర గంగిరెడ్డి, ఏ-2 సునీల్‌ యాదవ్‌, ఏ-3 ఉమా శంకర్‌ రెడ్డి, ఏ4 దస్తగిరితో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వారితో ఎప్పుడూ కలవలేదని సీబీఐకి అవినాష్‌ రెడ్డి చెప్పడం అబద్ధమన్నారు. హత్యకు నెల రోజుల ముందు అవినాష్‌ రెడ్డి ఫోన్‌ నుంచి ఉమాశంకర్‌ రెడ్డికి ఫోన్‌ కాల్‌ వెళ్లిందని, హత్యకు ముందు రోజు రాత్రి, హత్య అనంతరం ఏ-2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ గూగుల్‌ టేక్‌ఔట్‌ లోకేషన్‌ అవి నాష్‌ రెడ్డి ఇంట్లో చూపించిందని చెప్పారు. 2019 మార్చి 15వ తేదీ రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య అవినాష్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి మధ్య ఫోన్‌లో ఏం సంభాషణ జరిగిందని ప్రశ్నించారు. అవినాష్‌ రెడ్డికి సంబంధించిన మీడియాలో వివేకానందరెడ్డి మొదట గుండెపోటుతో చనిపోయారని, ఆ తరువాత ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఈ విషయంలో తాను ఐదేండ్ల నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఏపీ రాష్ట్ర ప్రజల అండ తనకు లభించిందన్నారు. తన తండ్రి హత్య కేసులో తీర్పు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానన్నారు. సీబీఐ ఈ కేసు విషయంలో తేల్చాల్సింది చాలా ఉందని, కొందరి ఒత్తిడి కారణంగా కేసు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, హత్యలు చేయించిన వారు చట్ట సభల్లో ఉండరాదన్నారు. వివేకానం దరెడ్డి హత్య మాత్రమే కాకుండా డాక్టర్‌ సుధాకర్‌ మరణం, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య లాంటివి ఏపీలో చాలా జరుగుతూనే ఉన్నాయన్నారు. కడప ప్రజలకు వైఎ స్‌ వివేకానందరెడ్డి ప్రతి ఇంట్లో మనిషి లాగా ఉండేవారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయరని, షర్మిలకే ప్రజలు పట్టం కట్టి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడమే తన లక్ష్యమన్నారు.