అరుదైన విషయాలతో.. చే

అరుదైన విషయాలతో.. చేక్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న చిత్రం ‘చే’. లాంగ్‌ లైవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై బీఆర్‌ సభావత్‌ నాయక్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్‌ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్‌, కార్తీక్‌ నూనె, వినోద్‌, పసల ఉమా మహేశ్వర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్‌ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్‌కు వెళ్లనుంది.
ఈ సందర్బంగా దర్శకుడు బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ, ”చేగువేరా బయోపిక్‌ తీయాలన్నది నా ఇరవై ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలతోపాటు అనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు రాజీపడకుండా తెరకెక్కించాం. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తాం’ అని తెలిపారు.