భూములిస్తే.. మోసం చేస్తారా?

If you land... will you cheat?– డేంజర్‌ జోన్‌లో ఇండ్లు, భూముల పరిహారం ఇవ్వకుంటే..
– బొగ్గు తవ్వకాలు అడ్డుకుంటాం
– మరో ఉద్యమానికి సిద్ధం : భూ నిర్వాసితులు
నవతెలంగాణ-మల్హర్‌రావు
బంగారు పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూములను బొగ్గు వెలికితీత కోసం ధారాదత్తం చేస్తే ప్రభుత్వం, జెన్కో సంస్థ తమను మోసం చేస్తోందని జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఓసీపీ బ్లాక్‌-1కి 500 మీటర్ల దూరంలో డేంజర్‌ జోన్‌లో ఉన్న భూ నిర్వాసితులు ఆరోపించారు. నిత్యం ఓసీపీ బాంబుల దెబ్బలతో ఇంటి గోడలు, ఇండ్లు కూలుతున్నాయని, మరోవైపు దుమ్ము, ధూళి, రసాయనాలతో రోగాల బారిన పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏండ్లుగా డేంజర్‌ జోన్‌ అభివృద్ధికి నోచుకోక, ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందక నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. తాడిచెర్ల ఓసీపీ బ్లాక్‌-1కు డేంజర్‌ జోన్‌ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లు, భూములు సేకరించి పరిహారం, ఆర్‌అండ్‌ఏ ప్యాకేజీ ఇవ్వాలని, లేదంటే బొగ్గు తవ్వకాలు అడ్డుకొని మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా తాడిచెర్ల భూ నిర్వాసితులు హెచ్చరించారు. భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ ఆవరణలో డేంజర్‌ జోన్‌లో ఉన్న నిర్వాసితులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్వాసితుల కమిటీ అధ్యక్షులు దండు రమేష్‌తోపాటు పలువురు మాట్లాడారు. అక్టోబర్‌ 20, 2008లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి ఏపీ జెన్కో డైరెక్టర్‌ మాట్లాడుతూ.. తాడిచెర్ల, కాపురం గ్రామాల్లోని భూముల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, వాటి తవ్వకాలకు వ్యవసాయ భూములు ఇవ్వాలని అడిగారన్నారు. బొగ్గు బావిని ప్రారంభిస్తామని, డేంజర్‌ జోన్‌లో ఉన్న ఇండ్లు, భూములను సేకరించి పరిహారం ఆర్‌అండ్‌ఏ ప్యాకేజీ ఇస్తామని చెప్పిన జెన్కో అధికారులు తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010లో ఇండ్లను సేకరిస్తామని 1088 ఇండ్లకు నెంబర్లు వేసి, ఆర్థిక, సామాజిక సర్వేలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు. ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేపట్టిన క్రమంలో 2,300 ఎకరాలకు పరిహారం ఒకే విడుతలో ఇవ్వకుండా విడుతల వారీగా 2016లో ఇచ్చి, 2017లో కోల్‌ మైనింగ్‌ ప్రారంభించినట్టుగా తెలిపారు. చివరి ప్రయత్నంగా ఓసీపీకి డేంజర్‌ జోన్‌లో ఉన్న ఇండ్లు, భూములు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టి టీఎస్‌ జెన్కో సీఎండీ ప్రభాకర్‌ రావును కలిసి విన్నవిస్తే.. 359.23 ఎకరాల భూములు, 2,652 ఇండ్లు సేకరిస్తామని 2021 ఏప్రిల్‌ 7వ తేదీన ప్రిలిమినరి నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. అయినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని, ప్రభుత్వం, జెన్కో అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ను కలిస్తే జెన్కో సంస్థ డబ్బులు డిపాజిట్‌ చేస్తే ఇస్తామని, మీరు జెన్కో అధికారులను అడగాలని చెప్పారని వాపోయారు. జెన్కో సీఎండీని కలిస్తే తమ వద్ద అంత డబ్బు లేదని, సీఎం కేసీఆర్‌ను కలవండని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జెన్కో సంస్థ భూ నిర్వాసితులను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఈ ఎన్నికలలోపు పీఎన్‌ పబ్లికేషన్‌ ప్రకటించి ఇండ్లు, భూములకు పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుంటే రెండు వేల మంది నిర్వాసితులతో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే కాక డేంజర్‌ జోన్‌లో ఉన్న 4 వేల ఓట్లను సైతం బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాసితులు ఇందారపు చెంద్రయ్య, కేశారపు చెంద్రయ్య, బండి స్వామి,ఆర్ని సత్తయ్య,అజ్మత్‌ అలీ,కేశారపు నరేశ్‌, శివ, సారయ్య, 200 మంది నిర్వాసితులు పాల్గొన్నారు.