విభజన హామీలపై కదులుతారా?

సంక్షేమ పథకాల అమలులో ఆనాటికి బీఆర్‌ఎస్‌ ముందున్నది. అయినా… ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. అహంభావ ధోరణులను జనం ఒప్పుకోలేదు. ఉద్యమ నాయకత్వం నుంచి నిరంకుశ ధోరణులు ఊహించు కోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం, పోరాడే హక్కుల కోసం పరితపించారు. వీటి ఫలితమే బీఆర్‌ఎస్‌ ఓటమి కదా! తెలంగాణ వస్తే అన్నీ పరిష్కారమవు తాయన్న కేసీఆర్‌ మాటలు నమ్మిన ప్రజలు, తమ సమ స్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు కోరుకున్న సమయమిది. ఇంకా కొత్త రాష్ట్రం అనే అవకాశం లేదు. పైగా ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పారు. ఇప్పటికీ, బీఆర్‌ఎస్‌ పాలనలో ఏమీ చేయలేదని ఏకపక్షంగా ఆరోపించ లేము. చేసిం దేమిటో, చేయవల్సిందేమిటో బేరీజు వేయాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ చర్చ జరగాలి.ఇదే కీలకం.
గత ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటే నమ్మి జనం బీజేపీకి ఓటేశారు. అది నేటికీ వాగ్దానంగానే మిగిలింది. ఆదిలాబాద్‌ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరిస్తామన్నారు. ఐదేండ్ల తర్వాత సాక్షాత్తూ మోడీ అక్కడ బహిరంగసభలో మాట్లాడి ఆ ఊసే ఎత్తలేదు. విమానాశ్రయ నిర్మాణం వాగ్దానం కూడా అటకెక్కింది. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ను విస్తరించకపోగా ఉన్నదాన్నే రద్దుచేసే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణకు సాగునీటి సమస్య సవాలులాంటిది. అయినా ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వకుండా, ఆ విధానమే రద్దు చేసేశామని తప్పించుకున్నది కేంద్రం. వీటన్నింటికి తోడు చట్టబద్ధంగా కేంద్రం నుంచి రావల్సిన నిధులు కూడా బిగబట్టి వేధించింది. జీఎస్టీ పేరుతో వనరులు తన చేతిలో పెట్టుకున్న కేంద్రం, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది. నదీజలాల పంపిణీని పరిష్కరించలేదు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగానే తీసుకున్నది. కానీ అత్యంత కీలక విషయం మాత్రం మరు గున పడుతున్నది. రాష్ట్ర విభజన జరిగి పదేండ్ల యినా విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం కాలేదో బహిరంగ చర్చ జరగటం అవసరం.
బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత పదేండ్లుగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్స వాల గురించి కాంగ్రెసు పట్టించు కోలేదని విమర్శిస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీని ఆహ్వానించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యమ కాలంలో పనిచేసిన అనేకమంది కవులను, గాయకులను, రచయితలను రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుకున్నారు. మరోవైపు, ఈ కాలమంతా కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిన విషయాలు కాంగ్రెస్‌ పార్టీ లేవ నెత్తుతున్నది. ‘జయజయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ గానీ, విద్యావంతుల వేదిక నాయకులుగా ప్రముఖ పాత్ర పోషించిన ప్రొ|| కోదండరామ్‌ గానీ, ఉద్యమ సూత్రధారి జయశంకర్‌, ఇంకా అనేకమందిని పూర్తిగా విస్మరించి పక్కన బెట్టారని నిలదీస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ గానే తెలంగాణ స్టేట్‌ టీఎస్‌ను టీజీగా మార్చారు. తెలంగాణ తల్లి రూపంలో సవరణలు ప్రతిపాదించారు. జిల్లాలు, మండలాల విభజన పున:పరిశీలన చేయాలని నిర్ణయించారు.
‘కేసీఆర్‌’ తెలంగాణా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న తపనతోనే ఎక్కువగా పనిచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు సాధించటం ద్వారా ఇది జరిగితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ భవనాలు, స్మారకాలు నిర్మించటం, లోతైన పరిశీలన, శాస్త్రీయ అధ్యయనాలు చేయకుండానే దీర్ఘకాలిక ప్రాజెక్టులు ఎన్నికలలోపు పూర్తిచేయాలని అతిగా ఆరాటపడటం, వాటి ఫలితాలు చూస్తున్నాం. కొత్త సచివాలయం కచ్చితంగా గొప్ప నిర్మాణం. కానీ పాత భవనాలు ధ్వంసం చేసి, ఇన్ని నిధులు వెచ్చించి నిర్మించటం నేటి రాష్ట్ర ప్రాధాన్యత కాదన్న విషయం అందరికీ తెలిసిందే. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మించిన ‘అమర జ్యోతి’, సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన భారీ జాతీయజెండా, 25 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, యాదాద్రి దేవస్థానం అభివృద్థి తదితర అనేక విషయాలలో తనకు దీర్ఘకాలిక గుర్తింపు కోసం తాపత్రయమే ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ‘బతుకమ్మ’ హడావుడి రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఉన్నతీరు తర్వాత కొనసాగలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ‘ఐలమ్మ’ పేరును కూడా వాడుకుని వదిలేశారు. ఆ స్ఫూర్తికి భిన్నమైన విధానాలు అమలు చేశారు. ఎన్నికల సందర్భంగా మళ్లీ సెంటిమెంటును ముందుకు తెచ్చేం దుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఇందుకు కారణం ఏమిటో గులాబీ నేతలు ఆలోచించుకోవాలి. విభజనా నంతరం పదేండ్ల తర్వాత ప్రజలు ఆశిస్తున్నదేమిటో పరిశీలించుకోవాలి. ఈ విషయం రాష్ట్రంలో నేటి పాలక పార్టీ కూడా ఆలోచించాలి.
సంక్షేమ పథకాల అమలులో ఆనాటికి బీఆర్‌ఎస్‌ ముందున్నది. అయినా… ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారు. అహంభావ ధోరణులను జనం ఒప్పుకోలేదు. ఉద్యమ నాయకత్వం నుంచి నిరంకుశ ధోరణులు ఊహించు కోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం, పోరాడే హక్కుల కోసం పరి తపించారు. వీటి ఫలితమే బీఆర్‌ఎస్‌ ఓటమి కదా! తెలంగాణ వస్తే అన్నీ పరిష్కారమవుతాయన్న కేసీఆర్‌ మాటలు నమ్మిన ప్రజలు, తమ సమ స్యలకు దీర్ఘకాలిక పరిష్కారాలు కోరుకున్న సమయమిది. ఇంకా కొత్త రాష్ట్రం అనే అవకాశం లేదు. పైగా ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పారు. ఇప్పటికీ, బీఆర్‌ఎస్‌ పాలనలో ఏమీ చేయలేదని ఏకపక్షంగా ఆరోపించ లేము. చేసిం దేమిటో, చేయవల్సిందేమిటో బేరీజు వేయాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ చర్చ జరగాలి.ఇదే కీలకం.
విభజన హామీలు, కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా కేంద్రం జాతీయ హోదా ఇవ్వని తీరు, ఇవన్నీ తెలంగాణ ప్రజలు విస్మరించలేరు కదా! ఈ కాలమంతా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక కాలం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంతో ‘సహకార’ సిద్ధాంతం చెప్పింది. రాజ్యాంగబద్ధంగానే హక్కుల కోసం, అధికారాల కోసం కేంద్రంతో పోరాడే అవకాశాలను బీఆర్‌ఎస్‌ నాయకత్వం చేజార్చుకున్నది. నిజానికి కేంద్రంతో పోరాడినప్పుడే ప్రాంతీయ పార్టీల విలువ పెరిగింది. బీఆర్‌ఎస్‌ పాలనలో

కేంద్రంతో సహకారం పేరుతో లాలూచీ కుస్తీ అమలు జరిగింది. బీజేపీ ఎత్తుగడలు తన చాపకిందకు నీళ్లు తెస్తున్నాయని అర్థమైన తర్వాత కొంతకాలం కేంద్రం మీద, మతోన్మాదం మీద తొడగొట్టి సవాళ్లు విసిరారు.కానీ కేంద్రం మీద సమిష్టిగా ఒత్తిడి చేద్దామని కేరళ వామపక్ష ప్రభుత్వం, వామపక్ష పార్టీల ప్రతిపాదనలూ పెడచెవిన పెట్టారు. కనీసం విభజన హామీల అమలు కోసం కూడా రాష్ట్రంలోని ఇతర పక్షాలను కలుపుకుపోయేందుకు సిద్ధపడలేదు.
పార్లమెంటు చర్చల సందర్భంగా ‘ఈ చిన్నమ్మ’ను కూడా గుర్తు పెట్టు కోవాలని సుష్మాస్వరాజ్‌ ఆనాడు అన్నారు. కేంద్రంలో రానున్నది తమ ప్రభుత్వమేననీ, తెలంగాణ దశ, దిశ మార్చేదీ తామేననీ అరుణ్‌జైట్లీ బల్లగుద్ది మరీ చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో వీరిద్దరూ ఉన్నారు. అయినా విభజన హామీల ఊసెత్తలేదు. పైగా, ఇప్పుడు మోడీ ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను ఆసరా చేసుకుని ‘పిల్లీ, పిల్లీ తగాదాను కోతి తీర్చినట్టు’ రాజకీయ స్వార్థంతో వేలుపెడుతున్నది.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రాథమిక అధ్యయనానికి కూడా నోచుకోలేదు. కాజీపేటకు రావల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోయారు. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థానంలో ఏడేండ్ల తర్వాత కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ప్రారంభించారు. కీలకమైన జాతీయ రహదారులకు రాష్ట్రం నుంచి నాలుగు లింకు రోడ్ల నిర్మాణానికి వాగ్దానం చేశారు. ఒక్క లింకు రోడ్డు 2020లో శంకుస్థాపన చేసి నత్తనడక నడుస్తున్నది. మిగిలిన మూడింటికి దిక్కులేదు. ట్రైబల్‌ యూనివర్సిటీ గురించి కేవలం ప్రకటన చేయడానికి పదేండ్లు పట్టింది. సింగరేణి తెలం గాణకు మణిహారం. అందులో తెలంగాణ వాటా 51శాతం కాగా కేంద్రం వాటా 49శాతం. ఈ నిష్పత్తి కొనసాగించకుండా కేంద్రం తన వాటాలను ప్రయివేటు సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో బొగ్గు బ్లాకు లను ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నది. ఇది క్రమంగా సింగరేణిని బలహీన పరచటమే కదా! ఇదే కాదు. గత ఎన్నికల సందర్భంగా నిజామా బాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటే నమ్మి జనం బీజేపీకి ఓటేశారు. అది నేటికీ వాగ్దానంగానే మిగిలింది. ఆదిలాబాద్‌ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరిస్తామన్నారు. ఐదేండ్ల తర్వాత సాక్షాత్తూ మోడీ అక్కడ బహిరంగసభలో మాట్లాడి ఆ ఊసే ఎత్తలేదు. విమానాశ్రయ నిర్మాణం వాగ్దానం కూడా అటకెక్కింది. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ను విస్తరించకపోగా ఉన్నదాన్నే రద్దుచేసే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణకు సాగునీటి సమస్య సవాలు లాంటిది. అయినా ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వకుండా, ఆ విధానమే రద్దు చేసేశామని తప్పించుకున్నది కేంద్రం. వీటన్నింటికి తోడు చట్టబద్ధంగా కేంద్రం నుంచి రావల్సిన నిధులు కూడా బిగబట్టి వేధించింది. జీఎస్టీ పేరుతో వనరులు తన చేతిలో పెట్టుకున్న కేంద్రం, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది. నదీజలాల పంపిణీని పరిష్క రించలేదు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన కేసును ఉప సంహరించుకుంటే పరిష్కరించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం కేసు ఉప సంహరించుకుంది. సమస్య మాత్రం అడుగు కదల్లేదు.
దశాబ్దాలుగా పేదరైతులు దున్నుకుంటున్న భూములను ధరణి పేరుతో గుంజుకుని భూస్వాములకూ, వారి వారసులకూ అప్పగించారు. వ్యవసాయ కూలీలు, కౌలురైతులు అన్న మాటలే ఈ పదేండ్లలో పాల కుల ఉచ్ఛారణకే నోచుకోలేదు. కార్మికుల కనీస వేతనాలు సవరించలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేవలం డీఏను బేసిక్‌తో కలిపి, అదే కనీస వేతనం అని ముసాయిదా ప్రకటించింది. ఇది కోటిమంది కార్మికులకు తీవ్ర అన్యాయం. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, విద్య, వైద్య రంగాలలో కార్పొ రేటీకరణ వంటి సమ స్యలు వెన్నాడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నదే ప్రశ్న. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పడితే విభజన సమస్యలు పరిష్కరించడం సులభమే. మోడీ ప్రభుత్వమే మళ్లీ వస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధపడతారా? ఆదిలాబాద్‌ సభకు ప్రధాని వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిసినపుడు ప్రధానిని పెద్దన్నగా సంబోధించటం విమర్శలకు గురైంది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో సంబంధాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామనీ, చర్చల ద్వారా సమ స్యలు పరిష్కరించుకుంటామనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిం చారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అనేక ఇతర సమస్యలు కేంద్రంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసు కోగలిగినవి ఉన్నాయి. ఏమైనా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చర్చకు రావల్సిన ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి. పారదర్శకంగా, అన్ని విషయాలు చర్చకు పెట్టాలి.

– ఎస్‌. వీరయ్య