ఇప్పుడు గుర్తొచ్చాయా?

ఇప్పుడు గుర్తొచ్చాయా?– గతంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగులు పెట్టారా? బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి సమీక్షా సమావేశంలో నేతల ఆవేదన
– హరీశ్‌రావు, కడియం ముందే ఆక్రోశం వెళ్లగక్కిన వైనం
–  జ్వరం వల్ల హాజరు కాలేకపోయిన కేటీఆర్‌
–  నేడు ‘జహీరాబాద్‌’పై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మన పరిస్థితి తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తీరుబడిగా సమీక్షలు, సమావేశాలు పెడితే ఏం లాభం…’ అంటూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్ల నుంచి ఇలాంటి మీటింగులు మీరెప్పుడైనా పెట్టారా..? అలా పెట్టి ఉంటే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేదా..? అంటూ వారు సీనియర్‌ నేతలు హరీశ్‌రావు, కడియం శ్రీహరి తదితరుల ముందే ఆక్రోశం వెళ్లగక్కారు. బుధవారం ప్రారంభమైన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి ఎంపీ స్థానంపై సమీక్ష నిర్వహించారు. సిట్టింగ్‌ ఎంపీ నేతగాని వెంకటేశ్‌తోపాటు ఆ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో లేరని ఈ సందర్భంగా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో క్యాడర్‌ తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోయిందంటూ వారు హరీశ్‌, కడియం శ్రీహరికి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈ గ్యాప్‌ ప్రధాన కారణమని వారు ఎత్తిచూపారు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలంటూ సూచించారు. లేదంటే ఎంపీ ఎన్నికల్లో మరింత ఇబ్బందులు తప్పబోవని హెచ్చరించారు. మరోవైపు జ్వరంతో బాధపడుతున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం నాటి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు. జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలంగాణ భవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ స్థానంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం నిజామాబాద్‌ పార్లమెంటుపై సమీక్ష జరగాల్సి ఉండగా.. దాన్ని సోమవారానికి వాయిదా వేసినట్టు కడియం శ్రీహరి మీడియాకు తెలిపారు.