– కేసులకు భయపడేవాన్ని కాదు
– రాజ్యాంగాన్ని మార్చొద్దంటే తప్పా?
– గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషమేంటో చూపుతాం
– ఖబడ్దార్ మోడీ, షా : సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
– కోరుట్లలో కాంగ్రెస్ జనజాతరకు పెద్దఎత్తున తరలొచ్చిన జనం
– నిజామాబాద్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపు
నవతెలంగాణ – కోరుట్ల
‘నేను కేసులకు భయపడేవాన్ని కాదు.. రాజ్యాంగాన్ని మార్చొద్దని మాట్లాడితే తప్పా? దమ్ముంటే అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడగాలేగానీ.. రాముని ఫొటోతో కాదు.. నా ఊరికొచ్చి.. నా గడ్డ మీదనే నన్ను బెదిరిస్తావా? ఈ ఎన్నికల్లో మీకు పరాభవం తప్పదు. గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషమేంటో చూపుతాం’ అంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. విపక్షాలపై ఈడీ, సీబీఐ సంస్థలతో అక్రమ కేసులు బనాయిస్తూ భయపెట్టి ఎంత కాలం బతుకుతారని, కానీ ఇక్కడ భయపడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. బెదిరించి పెత్తనం చెలాయించాలంటే నిజాం నవాబుకు పట్టిన గతే మోడీ, షాలకు పడుతుందని అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్‌నే ఓడించామని, ఆ పార్టీని బొందపెడుతున్నామని చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి ఈడీ, సీబీఐలాంటి సంస్థలు ఉండవచ్చుగానీ, తనకు నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. బీసీ గణనను ఎందుకు అడ్డుకుంటున్నారో అమిత్‌షా చెప్పాలని, బీసీల రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఈ పదేండ్లలో మోడీ హయాంలో దళిత, గిరిజన, బలహీనవర్గాలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని, దేశ సంపదంతా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ జనగణన చేసి వెనుకబడిన సామాజిక తరగతులకు న్యాయం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ కల్పించిన రిజర్వేషన్లతోనే చాలా మంది దళిత, గిరిజనులు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా కొంత నిలదొక్కుకున్నారని చెప్పారు. అలాంటిది.. రిజర్వేషన్లు ఎత్తివేసే బీజేపీ రహస్య ఎజెండాపై తాను మాట్లాడినందుకే కేసు పెట్టారని అన్నారు. తాను మాట్లాడింది తప్పయితే ఈ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలన్నారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, భవిష్యత్‌లో ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అవుతారని అన్నారు. సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, బోధన్ ఎమ్మెల్యే నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి సుదర్శన్, ధర్మపురి, వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఆ ట్విట్టర్ ఖాతా నాది కాదు
– అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ రిప్లై
– తాను తెలంగాణ సీఎంఓ, తన వ్యక్తిగత ఖాతాలు మాత్రమే వాడుతున్నట్లు వెల్లడి
– సీఎం రిప్లైను ఢిల్లీ పోలీసులకు అందజేసిన న్యాయవాది సౌమ్య గుప్తా
తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్)ఖాతా (ఐఎన్ సీ తెలంగాణ)ను తాను నిర్వహించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు స్పష్టత ఇచ్చారు. తెలంగాణ సీఎంఓ, తన వ్యక్తిగత ఖాతాలు మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎం తరపు అడ్వొకేట్ సౌమ్య గుప్తా బుధవారం ఢిల్లీ స్పెషల్ టీం పోలీసులకు వివరణ ఇచ్చారు. అనంతరం స్పెషల్ సెల్ ఎదురుగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సర్య్కూలేట్ చేశారని సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఫేక్ వీడియోను షేర్ చేసిన డివైజ్ (ఫోన్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్) ఇవ్వాలని కోరినట్లు అందులో పేర్కొన్నార న్నారు. ఈ అంశంపై సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తరపున రిప్లై ఫైల్ చేసినట్లు సౌమ్య గుప్తా వివరించారు. ‘ఐఎస్ సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాకు నేను ఓనర్ కాదు. ఆ ఖాతా నేను నిర్వహించడం లేదు. నేను కేవలం సీఎంఓ తెలంగాణ, నా వ్యక్తిగత ఖాతా… ఈ రెండింటిని మాత్రమే వాడుతున్నా. అందువల్ల కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడం పై నాకు సంబంధం లేదు’ అని రేవంత్ రెడ్డి పంపిన రిప్లై కాపీని పోలీసులకు అందించినట్లు సౌమ్య గుప్తా తెలిపారు. ఈ రిప్లై పై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది వారినే అడగాలని స్పష్టం చేశారు.
కాగా, రిజర్వేషన్ల పై కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో సీఆర్పీసీ 91/160 ప్రకారం గత నెల 29 న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో మే 1(బుధవారం), ఉదయం 10:30 లకు ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 16 సీ లోని స్పెషల్ సెల్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే అమిత్ షా వీడియో ను షేర్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్, ఆ ఖాతాను ఆపరేట్ చేసిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇతర సమాచారంతో రావాలని మెన్షన్ చేసింది. అయితే… ఈ నోటీసులకు సీఎం తన న్యాయవాది సౌమ్య గుప్తా ద్వారా సమాధానం పంపారు.