
నవతెలంగాణ – తాడ్వాయి
వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి గదిని, ఫార్మసిస్ట్ గదిని, స్టోర్ రూమ్, లేబర్ రూమ్, పేషంట్ వార్డ్ లను పరిశీలించారు. మందులు, రోగుల వివరాలను వైద్యాధికారి డాక్టర్ రణధీర్ ను అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషంట్ వార్డులో చికిత్స పొందుతున్న కొండపర్తి గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణీ స్త్రీలను కలిసి వారితో ఆసుపత్రిలో అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని, రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు. కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్స్ ల తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంలో డి ఎం అండ్ హెచ్ అప్పయ్య, డాక్టర్ రణధీర్ వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, వైద్య సిబ్బంది, కే శకుంతల, డి పి ఎం ఓ సంజీవరావు, హెల్త్ సూపర్వైజర్ సరస్వతి, ఫార్మసిస్ట్ నాగమణి, స్టాఫ్ నర్సులు స్పందన, రంజిత, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.